తితిదే పరిధిలోని పుణ్యక్షేత్రాల విశిష్టత, స్థల పురాణాన్ని ఆధునిక టెక్నాలజీతో భక్తులకు తెలియ చెప్పేందుకు తితిదే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా శ్రీపద్మావతి అమ్మవారి జన్మవృత్తాంతాన్ని, ఆమె పరిణయ ఘట్టాన్ని ఆగ్‌మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో భక్తుల ముందు ఉంచుతోంది. తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల యానిమేషన్ చిత్రాలు కథల రూపంలో భక్తులతో సంభాషిస్తాయి. దేవతా మూర్తుల యానిమేషన్ చిత్రాలను హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ ఐకాన్ ప్రైవేటు ఆధ్వర్యంలో వీకో సంస్ధ ప్రతినిధులు రూపొందించారు. అమ్మవారి జననం నుంచి వివాహ వృత్తాంతం, పుణ్యక్షేత్రం విశిష్టతను ఈ చిత్రాల్లో పొందుపరిచారు.
ఇలా వీక్షించవచ్చు
తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోకి ప్రవేశించే భక్తులు అండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి పద్మావతి పరిణయం యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఫ్రేమ్స్ లో మొదట శ్రీ పద్మావతి, శ్రీనివాసుల కళ్యాణ వైభవం అనే మొదటి ఫ్రేమ్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేయాలి. ఫోన్ తో ఇయర్ ఫోన్లను అనుసంధానం చేసుకొని మొబైల్ ఏఆర్ టెక్నాలజీతో కూడిన ఫ్రేమ్ పై స్కాన్ చేస్తే చిత్రంలోని దేవతా మూర్తులు వారి యొక్క వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో భక్తులకు వినిపిస్తారు. ఇలా అన్ని ఫ్రేమ్‌లను స్కాన్ చేయడం ద్వారా పద్మావతి పరిణయ వృత్తాంతాన్ని ఘట్టాల వారీగా సంభాషణ రూపంలో వినవచ్చు. 15 నిమిషాల పాటు పద్మావతి అమ్మవారి పరిణయం వీక్షించవచ్చు..
దిల్లీ, నెల్లూరుకు చెందిన ఇద్దరు భక్తులు పదిహేను లక్షల రూపాయలను దీనికి విరాళం అందించారు. తితిదేపై ఆర్థిక భారం లేకుండా ఆధునిక సాంకేతికతను వినియోగించిన అధికారులు ధర్మప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు.