ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనుచరులు తితిదేకు చెందిన ఆస్తులను కబ్జా చేసేందుకు కుట్రపన్నారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రి సమీపంలో ముంబయికి చెందిన ఉద్వేగ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని శనివారం తెదేపా నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ''తితిదేకు చెందిన విలువైన స్థలాలపై అధికార పార్టీ నేతల కళ్లుపడ్డాయి. ముంబయికు చెందిన సంస్థ ఖాతాలో కనీసం వేల రూపాయిలు కూడా లేవు. అలాంటి సంస్థ రూ.300 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం వెనుక కుట్ర దాగి ఉంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఒక ప్రణాళిక ప్రకారం తితిదే స్థలాలను దశలవారీగా కబ్జా చేసేందుకు ఇలాంటి తప్పుడు ఒప్పందాలు తెరపైకి తెస్తున్నారు. ముంబయి సంస్థ ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణం చేస్తానంటే తితిదే పెద్దలు ఎందుకు ఉత్సాహం చూపారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో ముఖ్యమంత్రి ఆయన్ని బర్తరఫ్ చేయాలి. మంచి పేరున్న టాటా క్యాన్సర్, అరవింద్ కంటి ఆసుపత్రులకు తెదేపా పాలనలో స్థలాలు కేటాయించాం. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరు, పేరు లేని సంస్థలకు స్థలాలు అప్పగిస్తున్నారు. తితిదేకు, ఆసుపత్రికి మధ్య జరిగిన రహస్య ఒప్పందాలను త్వరలో వెలికి తీస్తాం'' అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తామని చెబుతున్న ప్రైవేటు సంస్థను తితిదే పెద్దలు గుడ్డిగా నమ్మడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ఇదీ చదవండీ... సర్వశక్తులూ ఒడ్డుతున్న తెదేపా.. గెలుపుపై వైకాపా ధీమా..!