తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చిన కొవిడ్ రోగి అంబులెన్స్‌లోనే మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గురవరాజపల్లెకి చెందిన విశ్రాంత కానిస్టేబుల్‌కి కరోనా సోకింది. చికిత్స కోసం అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకువచ్చారు. హాస్పిటల్లో పడకలు ఖాళీ లేకపోవటంతో అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స చేశారు. వైద్యం అందిస్తుండగానే అతను మరణించాడు. దీంతో రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబులెన్స్‌లో ఆసుపత్రికి వచ్చి మూడు గంటలు గడిచినా... పడకలు లేవని చెప్పారని మండిపడ్డారు. రోగిని ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీయూ పడకలు ఖాళీ లేవని.. వచ్చిన రోగులను వెనక్కి పంపించకూడదనే ఉద్దేశంతో ట్రాయేజ్ కేంద్రంలో బెడ్లు ఏర్పాటు చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అవి కూడా నిండిపోవటంతో వాహనంలోనే ఉంచి ప్రాథమిక చికిత్స అందించినట్లు వెల్లడించాయి.
ఇదీ చదవండి: భార్యకు కరోనా... మనస్థాపంతో భర్త ఆత్మహత్య