Ropeway At Annavaram : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్వతమాల’ (జాతీయ రోప్‌వే అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా రాష్ట్రంలోని పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పర్యాటకశాఖ ఈడీ మాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అన్నవరంలో ఆయన మాట్లాడుతూ... ‘కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్‌హెచ్‌ఏఐ అనుబంధ సంస్థ నేషనల్ హైవే లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు ఈ ప్రాజెక్టును అప్పగించింది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అన్నవరంలో పంపా రిజర్వాయర్ మీదుగా రూ.10 కోట్లతో రోప్‌వేతోపాటు కొండ దిగువన పంపా సరోవరం వద్దనే బోటు షికారు ఏర్పాటు చేసేలా పరిశీలిస్తున్నాం. సుమారు రూ.11.50 కోట్లతో కోరుకొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం కొండ నుంచి మెట్లమార్గం, పాండవుల కొండకు రెండు రోప్‌వేలు, పట్టిసీమ ఆలయం నుంచి గోదావరి బెర్మ్ (పర్యాటక హోటల్ దగ్గరలో) వరకూ రూ.2.50 కోట్లతో మరొకటి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, గుంటూరు జిల్లా కోటప్పకొండ, వైఎస్‌ఆర్ కడప జిల్లా గండికోట, కర్నూలు జిల్లా అహోబిలం, విజయవాడ భవానీ ఐల్యాండ్‌లలో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపేందుకు పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి : ‘జల్‌జీవన్’ నిధులను ఎందుకు ఖర్చుపెట్టడం లేదు..?: కేంద్ర మంత్రి షెఖావత్