నెల్లూరు నగరంలోని ప్రాచీన వేణుగోపాలస్వామి దేవస్థానం ఆస్తుల అమ్మకానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆలయ నిర్వహణ కష్టంగా మారడానికి తోడు... నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులుండడంతో దేవస్థానానికి సంబంధించిన ఆస్తులను విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలోనూ ఆలయానికి సంబంధించిన ఆస్తులు అమ్మడంతో వచ్చిన సొమ్మును... ఆలయ నిర్వహణ కోసం వాడుతూవచ్చారు. బ్యాంకు వడ్డీలతో పాటు వేతనాలు, నిర్వహణ ఖర్చులు పెరగాయి. ఫలితంగా ఆలయ ఆస్తులు అమ్మాలని నిర్ణయించారు. దేవస్థానం ఆధునికీకరణ చేయాలంటే రూ.20కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నగరంలో 44 ఎకరాలు..
నగరంలో ఆలయానికి సంబంధించిన 44ఎకరాలు విలువైన స్థలాలు ఉన్నాయి. ప్రస్తుత పెరిగిన ధరల ప్రకారం కోట్లలో ధరలు పలుకుతున్నాయి. అయితే విలువైన ఆలయ భూములు విక్రయించవద్దని భక్తులు వ్యతిరేకించగా... ఈ ప్రతిపాదనలు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెబుతున్నారు. లీజుకు ఇచ్చి అభివృద్ధి పనులు చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఆలయ కమిటీ నిర్ణయించింది.
ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొత్తవీధిలో ఉన్న 15 సెంట్ల ఆలయ స్థలాన్ని విక్రయించేందుకు అధికారులు నిర్ణయించారు. బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామని ప్రకటించారు. మిగిలిన స్థలాలను లీజు విధానంలో ఇస్తామని... బహిరంగ వేలం ద్వారానే ఆదాయాన్ని తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఆకస్మికంగా ముగిసిన సీఎం దిల్లీ పర్యటన