కర్నూలు జిల్లా మిడుతూరు మండలం దేవనూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు సర్వే నంబరు 111లో 2.79 ఎకరాల భూమి తన తల్లి సాలమ్మ పేరు మీద ఉంది. అందులో సోదరుడు వెంకటేశ్వర్లు పేరుపై 1.39 ఎకరాలు ఎక్కించి పాస్ పుస్తకం తీసుకున్నారు. మిగిలిని 1.40 ఎకరాల భూమిని తల్లి పేరు మీద నుంచి శ్రీనివాసులు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రయత్నించగా... ఆన్లైన్లో మిగులు భూమిగా చూపిస్తోంది. 5 నెలలుగా వీఆర్వో చుట్టు ప్రదక్షిణలు చేసినా.. తన సమస్య పరిష్కారం కాలేదని గతనెల 30న ఆర్డీవోకు వినతి ఇచ్చారు.
కల్లూరు మండలం కె.మార్కాపురంకు చెందిన సురేంద్రరెడ్డి తల్లి వెంకటేశ్వరమ్మ పేరు మీద వెల్దుర్తి మండలం ఈ.మల్లెపల్లి సర్వే నెంబరు 109/4 లో 91 సెంట్ల భూమి ఉంది. 2018లో తల్లి వెంకటేశ్వరమ్మ నుంచి దాన విక్రయంగా సురేంద్రరెడ్డి ఆ భూమిని
రిజిష్టర్ చేయించుకున్నారు. ఈ ఏడాది జూలై 18న మీ సేవలో పాసు పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి 15 సార్లు తిరిగిన ఫలితం లేకపోయే సరికి వీఆర్వోను సంప్రదించగా.. 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. అందులో 30 వేల రూపాయలు ఇచ్చానని మిగిలిన డబ్బులు ఇవ్వనందున కొర్రీలు వేసి నా దరఖాస్తు తిరస్కరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినా.. లంచం అందితేనే రైతు చేతికి పుస్తకాలు అందే పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. భూమిని బట్టి ఒక్కో పాసుపుస్తకానికి ఐదు వేల నుంచి 10 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా.. ఓ రెవిన్యూ అధికారి వద్ద వందల సంఖ్యలో పట్టాదారు పాసు పుస్తకాలు దర్శనమిచ్చాయి. పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వకుండా ఎందుకు మీ వద్ద ఉంచుకున్నారంటూ.. ఏసీబీ అధికారులు ప్రశ్నించగా... ఆగమేగాలపై రైతులను కార్యాలయాలకు పిలిపించి పాసు పుస్తకాలు అందచేశారు.
కర్నూలు జిల్లాలో 882 గ్రామ సచివాలయలు, 303 వార్డు సచివాలయాలు, 900కుపైగా మీ సేవ కేంద్రాలు ఉన్నప్పటికీ... అక్కడ దరఖాస్తు చేసుకున్న తరువాత సంబంధిత వీఆర్వోను కలిసి ముడుపులు చెల్లిస్తేనే భూ సమస్యలకు పరిష్కారం కాని, కొత్త పాసు పుస్తకాలు మంజూరు కాని కావడం లేదు. జిల్లాలో కర్నూలు, కల్లూరుతో పాటు గడివేముల, బనగానపల్లె, కోవెలకుంట్ల, డోన్, దేవనకొండ, వెల్దుర్తి పరిధిలో రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటంతో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇదే అదనుగా
అధికారులు పరిష్కారానికి పది వేల రూపాయల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు.
జిల్లాలో 2 లక్షల 17 వేల పాస్ పుస్తకాలకు దరఖాస్తులందగా... లక్షా 19 వేలు మాత్రమే పరిష్కరించారు. 81 వేలకుపైగా అర్జీలను లంచాలు ఇవ్వని కారణాలతో కొర్రీలు చూపిస్తూ తిరస్కరణకు గురిచేశారు.
ఇదీ చదవండి: