కాకినాడ తీరంలోని మడ అడవులు, తీర ప్రాంత జంతు, జీవజాల పరిస్థితులపై సమగ్ర పరిశీలనకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ).. నిపుణుల బృందాన్ని నియమించింది. కాకినాడ తీరంలోని జీఎంఆర్/ఈసీపీఎల్ కర్మాగారం తవ్వకాల వ్యర్థాల పారబోతతో మడ అడవులతో పాటు పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఎన్జీటీని ఆశ్రయించారు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించింది.
కమిటీ ఏర్పాటు..
పర్యావరణ, సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా ఆ కర్మాగారం వ్యవహరిస్తోందని పిటిషన్‌దారు తరపు న్యాయవాదులు ఆరోపించారు. కర్మాగారానికి సమీపంలోనే కోరింగ వన్యప్రాణి కేంద్రం, కుంభాభిషేకం ఆలయం ఉన్నాయని తెలిపారు. కర్మాగారం యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా తీరంలో గోడ నిర్మించిందని తెలిపారు. వ్యర్ధాల పారబోత, గోడ నిర్మాణంతో మడ అడవులు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం అక్కడి పరిస్థితులపై పరిశీలనకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత నిర్వహణ మండలి, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలోని ఉన్నతాధికారులతోపాటు కోరింగ వన్యప్రాణి కేంద్రం డివిజన్ అటవీ అధికారి సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్టోబరు 13లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 13కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: ఏపీ విద్యార్థితో ముచ్చటించిన ప్రధాని మోదీ... 'గారు' అంటే అర్థం చెప్పారా? అని ఛలోక్తి