విలీన గ్రామాల సమస్యలపై హోంమంత్రి సుచరిత సమీక్ష గుంటూరు నగరపాలక సంస్థలో విలీనమైన 10 గ్రామాల సమస్యల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని... హోంమంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీన గ్రామాల సమస్యలపై ఆమె ఆయా గ్రామాల ప్రతినిధులు, అధికారులతో గుంటూరులో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో రహదారులు సరిగాలేవని, వీధి దీపాలు పాడైనా... నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవటంలేదని ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. కేవలం పన్నులు వసూలు చేసుకుంటున్నారే తప్ప... సౌకర్యాలు కల్పించటంపై దృష్టి సారించటం లేదని మంత్రి వద్ద వాపోయారు. గ్రామాల్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో భూగర్భ డ్రైనేజి పనులు మధ్యలోనే ఆగిపోవటం వలన ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ, అధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి :
ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ: మంత్రి సుచరిత