కరోనా వస్తే క్వారంటైన్‌లో ఉండాలి! కుటుంబ సభ్యులతో వాళ్లతో కలవకుండా భౌతికదూరం పాటించాలి! వైద్యులంతా చేస్తున్న సూచనలివే. 3, 4 గదులున్న ఇళ్లలో ఇది సాధ్యపడుతుంది. ఇరుకైన ఇళ్లలో జీవనం సాగిస్తున్న వాళ్ల సంగతేంటి? గుడిసెలో ఉండే మారుమూల గ్రామాల్లోని ప్రజలకు కరోనా వస్తే ఏం చేయాలి..? తొలి దశలో కరోనా వ్యాప్తి పల్లెల్లో పెద్దగా లేకపోయినా.. ఈ సారి అక్కడకీ విస్తరించింది. అసలే నామమాత్రపు వైద్య సౌకర్యాలుండే అలాంచి చోట్ల వైరస్ వ్యాప్తి కలవరపరుస్తోంది. అవగాహన లోపం, భౌతిక దూరం పాటించే అవకాశం లేకపోవటం లాంటి సమస్యలు పల్లెజనాన్ని మానసికంగా కుంగ దీస్తున్నాయి. అందుకే..ఇంట్లో ఎవరైనా కరోనాతో తనువు చాలిస్తే...ఆ బెంగతో మరొకరు ప్రాణాలు విడుస్తున్నారు. ఇలా కుటుంబాలన్నీ చితికి పోతున్నాయి.
మే నెల తొలి 4 రోజుల గణాంకాలు పరిశీలిస్తే పల్లెలపై కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 1.39 రెట్లు అధికంగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం కేసుల్లో 34.5% పట్టణాల్లో, గ్రామీణ భారతంలో 48.1% నమోదు అయ్యాయి. మిగిలిన 17.4% కేసులు గ్రామీణ, పట్టణ జనాభా కలిసిన జిల్లాల్లో ఉన్నాయి. గతేడాది మార్చిలో పల్లెల్లో కేసుల నమోదు ప్రారంభమైనా, పట్టణాల్లోని కేసుల సంఖ్య అధిగమించడానికి పల్లెలకు దాదాపు 5నెలలు పట్టింది. ఆ ఏడాది జులై తర్వాతే గ్రామాల్లో కేసులు పెరగడం ప్రారంభమయ్యాయి. రెండో ఉద్ధృతిలో అందుకు భిన్నంగా కేవలం 2నెలలే పట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో ఉద్ధృతి ప్రారంభమైంది. ఏప్రిల్‌కల్లా 44.1% కేసులతో గ్రామీణ భారతం...పట్టణాలను అధిగమించింది.
పల్లెల్లో కరోనాకు పగ్గం వేసేదెలా...? అన్ని ప్రభుత్వాలకూ ఇదే పెద్ద సవాలు. గ్రామాల్లో వైద్య వసతులు ఎలా ఉంటాయో తెలియంది కాదు. ఇప్పుడున్న వ్యాప్తితోనే సతమతం అవుతుంటే రెట్టింపైతే పరిస్థితేంటి..? ఆ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన మొదలైంది అధికార యంత్రాంగాల్లో. చాలా మందిలో లక్షణాలు కనిపించినా..బయటకు చెప్పటం లేదు. కరోనా అని తెలిస్తే... అంతా వెలివేస్తారని...తక్కువగా చూస్తారని..ఇలా రకరకాల అపోహలతో నలతగా ఉన్నా వదిలేస్తున్నారు. అది చివరికి ప్రాణాలు తీస్తోంది. ప్రస్తుతానికి దేశంలోని ప్రభావిత గ్రామాల్లో 10% మందిలోనైనా కరోనా లక్షణాలు ఉండి ఉంటాయన్నది నిపుణుల అంచనా. పల్లెల్లో మరణాలు... ప్రభుత్వాలు చెప్పే లెక్కల కన్నా ఎక్కువే ఉంటాయన్న వాదనా ఉంది. పడకలు, ఐసోలేషన్ కేంద్రాలు, ఆక్సిజన్ సిలిండర్లు నగరాలు, పట్టణాల్లో దొరకటమే గగనమవుతోంది.
ఇదీ చదవండి: