అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం వెనుక భాజపా పరోక్ష అంగీకారం ఉన్నట్లు అర్థమవుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదానికి వైకాపా మద్దతు అవసరమనే ఉద్దేశంతోనే కేంద్రం సాచివేత ధోరణి అనుసరిస్తోందని విమర్శించారు. ఈ రెండు బిల్లులూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ చివరి క్షణంలో ఎలా ఉత్తర్వులిచ్చారో.. అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వాల్సిన రోజు వస్తుందని స్పష్టం చేశారు.
‘'బిల్లులపై జనవరి 22న శాసన మండలిలో చర్చ తర్వాత ఛైర్మన్ తన విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపారు. బిల్లుల ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంలోనూ.. ఇది సెలక్ట్ కమిటీ పరిశీలనలో ఉందని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. బిల్లులను రెండోసారి శాసనసభలో ప్రవేశపెట్టడం రూల్ 79(5)కి విరుద్ధం. అవి మండలికి రెండోసారి వచ్చినప్పుడు.. సెలక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం లోగడే తీసుకున్నారని, తిరిగి ఎలా ప్రవేశపెడతారంటూ మెజారిటీ సభ్యులు అభ్యంతరం చెప్పారేగానీ తిరస్కరించలేదు. ఆర్టికల్ 197(2) ప్రకారం నెల గడిచాక గవర్నర్ ఆమోదానికి బిల్లులను పంపడం రాజ్యాంగ విరుద్ధమవుతుంది.'- మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
మండలి ఆమోదం తప్పనిసరి
విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు భూసేకరణ, భవనాల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.వేల కోట్లు ఖర్చవుతాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయకూడదనే భావనతోనే అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానుల బిల్లులను ద్రవ్య బిల్లులుగా కాకుండా సాధారణ బిల్లులుగా శాసనసభ నిబంధన 93కు విరుద్ధంగా ప్రవేశపెట్టారని అన్నారు. దీనికి ఆర్థిక ప్రకటనా జత చేయలేదన్నారు. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లులు మినహా ఇతర బిల్లులకు మండలి ఆమోదం తప్పనిసరని తెలిపారు. బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపేటప్పుడు రూల్ 124 ప్రకారం విధిగా శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ సంతకాలు ఉండాలని తెలిపారు. ఈ 2 బిల్లులపై మండలి ఛైర్మన్ సంతకం చేయలేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.
పార్లమెంటు ఆమోదించిన చట్టమే అంతిమం
పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశీలిస్తే.. ఒకే అంశానికి సంబంధించి పార్లమెంటు, శాసనసభల ఆమోదం పొందిన చట్టాలు భిన్నంగా ఉన్నాయి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 (2) ప్రకారం పార్లమెంటు ఆమోదించిన చట్టంలో ఉన్నదే నిలుస్తుందని ఐటీసీఎస్‌ఎస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1985 ఎస్‌సీ 476, దీపక్‌చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్‌ప్రదేశ్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులున్నాయని పేర్కొన్నారు. వీటిని పరిశీలించకుండానే గవర్నర్ బిల్లులను ఆమోదించడం గర్హనీయమని అన్నారు.
ఇదీ చదవండి: కడప జిల్లాలో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి