శుద్ధలక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్జయలక్ష్మీ సరస్వతి
శ్రీర్లక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా
అంటూ పూజా సమయంలో దేవిని ప్రార్థిస్తాం. కానీ ఇందులో పేర్కొన్న లక్ష్ములు అష్టలక్ష్ముల పట్టికలో లేరు. వారు ప్రసాదించే సంపదల పేరుతో పిలిచారు. ‘వర’ అంటే ఎన్నుకున్న, ‘లక్ష్మి’ అంటే సంపద. అంటే అన్నింటికంటే శ్రేష్ఠమైన సంపదను పొందడం కోసం చేసేది. వ్రతం అంటే నియమబద్ధమైన నడవడిక. ఎలా ఉంటే దేవి అనుగ్రహిస్తుందో అలా నడుచుకోవటం. ఆ ప్రవర్తన ఎలా ఉండాలన్నది వ్రతకథ తెలియజేస్తుంది.
శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతాన్ని చేయమని ఆ దేవే ఆదేశించింది. ఎవరికైనా ఆ రోజు వీలు కాకపోతే, పూర్ణిమనాడు కానీ, తర్వాతి శుక్రవారం కానీ లేదా ఈ మాసంలో ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. అంటే భార్గవుడు. అమ్మవారు భార్గవి. పుట్టింటి సంబంధమది. పౌర్ణమినాడు చంద్రుడు 16 కళలతో నిండుగా ఉంటాడు. అది సోదర సంబంధం. శ్రావణమాసం విష్ణువుకి ప్రీతి. ఇది భర్తృ సంబంధం.
వ్రతానికి ముందురోజే కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకోవాలి. వ్రతంనాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి, అభ్యంగన స్నానం చేసి, నిత్యనైమిత్తిక క్రియలన్నీ పూర్తిచేసుకుని, పూజ చేసుకోవాలి. పూజగదిని పూర్వం గోమయంతో అలికేవారు. ఇప్పుడు చక్కగా కడిగి శుభ్రం చేసి, ముగ్గులు పెట్టుకోవచ్చు. పీటను పసుపు కుంకుమలతో అలంకరించి, దానిమీద బియ్యం పోసి కలశాన్ని అమర్చి, దానిని గంధాక్షతలు, పంచపల్లవాలు, పుష్పాలతో అలంకరించి, అమ్మవారి ప్రతిరూపంగా కొబ్బరికాయను కలశంపై ఉంచి, పసుపుతో చేసిన గౌరీదేవిని, గణపతిని, తమలపాకులలో ఉంచి, షోడశోపచార పూజ చేయాలి. అష్టోత్తర సహస్ర నామాదికాలు చేసుకోవచ్చు. పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, కొబ్బరికాయ నివేదన చేయాలి. పూజ ముగిసిన తర్వాత సిద్ధంగా ఉంచుకున్న తొమ్మిది పోగులు, తొమ్మిది ముడులు ఉన్న తోరాలను పూజించి, ఒకటి అమ్మవారికిచ్చి, మరొకటి ముత్తైదువకి ఉంచి, వేరొకటి తను ధరించి, కథ చెప్పుకోవాలి. అప్పుడు ఒక ముత్తైదువని సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా భావించి పూజించి వాయనం ఇవ్వాలి. అమ్మవారికి కూడా వాయనం ఇవ్వాలి. వాయనంలో నానబెట్టిన శనగలు, పండ్లు, తాంబూలం ఉంటాయి. లక్ష్మీదేవికి ఆవుపాలతో చేసిన బియ్యపు పరమాన్నం అంటే ఇష్టం. పులిహార కూడా ప్రీతికరమే. తొమ్మిది రకాల పిండివంటలు చేసేవారూ ఉన్నారు అదంతా వారి వారి శక్తి. ఇదీ వరలక్ష్మీ వ్రతం.
నూతన వధువుగా..
వరలక్ష్మి అంటే వరుడితో కూడి ఉన్న లక్ష్మి... అప్పుడే పాలసంద్రం నుంచి ఉద్భవించి, శ్రీమహా విష్ణువు కంఠాన వరమాల వేసి, నూతన వధువుగా ఉన్న లక్ష్మిదేవి. అందుకే ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు మంగళగౌరి వ్రతం లేదా వరలక్ష్మి వ్రతం తప్పక చేయాలంటారు.