కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)ను నియమించేందుకు కార్యాచరణ ప్రారంభించాకే.. ఎస్‌ఈసీగా ఉన్న రమేశ్‌కుమార్ పదవీ కాలం కుదించేందుకు ఫైల్ ప్రారంభించినట్లు హైకోర్టు గుర్తించింది. సంబంధం లేని కారణాలతో, వక్రమార్గంలోనే ఆర్డినెన్స్‌కు సంబంధించిన ఫైళ్లు నడిచినట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు 22 మందిని ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా నియమించారని, వాళ్లెవరూ 65 ఏళ్లు దాటినవారు కాదని గుర్తుచేసింది. 77 ఏళ్ల వ్యక్తిని కొత్త ఎస్‌ఈసీగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. దాన్ని ఎన్నికల సంస్కరణగా భావించలేమంది.
రమేశ్‌కుమార్ పదవీకాలం పూర్తయినట్లు పేర్కొనేందుకు ఫైల్‌ను ఏప్రిల్ 10న రాత్రి 9.45 గంటలకు ప్రారంభించారని.. దానిపై గవర్నర్ సంతకం లేకుండానే పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఆమోదంతో రాత్రి 10.07 గంటలకు జీవో 618 జారీ చేశారని హైకోర్టు ఆక్షేపించింది. రమేశ్‌కుమార్ పదవీకాలం కుదింపును సమర్థించుకునేందుకు ప్రభుత్వం వద్ద కారణాలు లేవంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చేలా గవర్నర్ తక్షణ చర్యలు తీసుకునేందుకు సైతం తగిన ఆధారాలు లేవని పేర్కొంది. సాధారణంగా ఎస్‌ఈసీని అధికరణ 243(కే)(1) ప్రకారమే గవర్నర్ నియమిస్తారు. అయితే కొత్త ఎస్‌ఈసీని ఆర్డినెన్స్ ద్వారా నియమించడం సరికాదని ఆక్షేపించింది. ‘ఎన్నికల కమిషనర్‌కు ఉండాల్సిన అర్హతలు, నియామక నిబంధనలను మంత్రిమండలి సిఫారసు మేరకు ఆర్డినెన్స్ ద్వారా నిర్ణయించడానికి వీల్లేదు. ఆర్డినెన్స్ ఏ సందర్భంలో ఇవ్వచ్చో అధికరణ 213(1) వివరిస్తుంది. అయితే ప్రస్తుత ఆర్డినెన్స్ ఆ నిబంధనలకు అనుగుణంగా లేదు’ అని ధర్మాసనం తీర్పులో అభిప్రాయపడింది.
కార్యాలయానికి వెళ్లని జస్టిస్ కనగరాజ్
ఎస్‌ఈసీగా రమేశ్‌కుమార్ స్థానంలో నియమితులైన జస్టిస్ కనగరాజ్ శుక్రవారం కార్యాలయానికి హాజరుకాలేదు. ఆయన బాధ్యతలు చేపట్టాక రోజూ కార్యాలయానికి వచ్చేవారు. హైకోర్టు తీర్పు వెలువడ్డాక కార్యాలయానికి రాలేదు.
అధికారులపై చర్యలు ఇప్పట్లో లేనట్లే!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ కొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని గతంలో ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే ఎన్నికల నియమావళి ప్రస్తుతం అమలులో లేనందున వారిపై ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: