ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు 2021 జనగణన ప్రక్రియ అడ్డంకిగా మారనుంది. ఏడాది పాటు ప్రస్తుత భౌగోళిక సరిహద్దులను మార్చేందుకు వీల్లేదని కేంద్ర హోంశాఖ ఆధ్వర్వంలోని జనగణన రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన సమాచార హక్కు కార్యకర్త ఇనుగంటి రవి కుమార్ అడిగిన సమాచారానికి బదులిచ్చిన కేంద్ర హోంశాఖ జనగణన పూర్తి అయ్యే వరకూ కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ గ్రామాలను ఏర్పాటు చేయొద్దని గతంలో ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేసింది. 2020 మార్చి 31 వరకే ఆ సమయం ఉన్నప్పటికీ కరోనా కారణంగా దీన్ని 2021 వరకూ పొడిగించామని జనగణన రిజిస్ట్రార్ జనరల్ ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో తెలిపారు. దీంతో రాష్ట్రంలో జనగణన పూర్తి అయ్యేంత వరకూ.. మరో ఏడాదిన్నర పాటు కొత్త జిల్లాల ప్రక్రియ వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలని గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీఎస్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీని, కలెక్టర్ ఆధ్వర్వంలో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. 2021 ఏప్రిల్ నుంచి జనగణన పూర్తి అయ్యేంత వరకూ జిల్లా, మండల, గ్రామ రెవెన్యూ పరిధిలో మార్పులు చేయొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు జనగణన రిజిస్ట్రార్ జనరల్ స్పష్టం చేశారు. కరోనా కారణంగా 2021 జనగణన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ... దీని తదుపరి ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సమాధానమిచ్చింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు కనీసంగా మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏయే అంశాలపై నిర్బంధం కొనసాగుతుందంటే..
1. కొత్త జిల్లాల ఏర్పాటు
2. ఇప్పటికే ఉన్న జిల్లాల పాలనాపరిధిని మార్చడం
3. ఉన్న జిల్లాలను రద్దు చేయడం
4. కొత్త సబ్ డివిజన్లు ఏర్పాటుచేయడం
5. ఇప్పటికే ఉన్న ఉప జిల్లాల సరిహద్దులను మార్చడం
6. ఉన్న ఉప జిల్లాలను రద్దుచేయడం
7. ఇప్పుడున్న గ్రామాలను విడదీసి/విలీనం చేసి కొత్త గ్రామాలను ఏర్పాటుచేయడం.
8. ఇప్పటికే ఉన్న పట్టణ పరిధులను మార్చడం
9. పట్టణాల నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించడం
10. కొత్త పట్టణాలను ప్రకటించడం
11. ఉన్న పట్టణాలను రద్దుచేయడం
12. పైన పేర్కొన్న వ్యవస్థల పేర్లు, స్పెల్లింగులు మార్చడం
13. పట్టణాల్లోని వార్డు సరిహద్దులను మార్చడం
14. ఇవికాకుండా ఇంకేదైనా న్యాయపరిధులను మార్చడం
ఇదీ చదవండి: