రాష్ట్రంలో మహిళల రక్షణకు పార్టీలకు అతీతంగా ఐక్యపోరాటం చేయాలని వివిధ పార్టీలు, సంఘాల మహిళా ప్రతినిధులు తీర్మానించారు. రాజధాని అమరావతిపై మాట మార్చినందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకద్రోహం కేసు పెట్టాలనే నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కరోనాతో భర్తను కోల్పోయిన మహిళలకు ప్రభుత్వం ఫించను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైకాపా రెండేళ్ల పాలనలో మహిళలపై 600కు పైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయని ధ్వజమెత్తారు. తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష వర్చువల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 'వైకాపా పాలనలో మహిళలపై దాడులు, మహిళా సంక్షేమం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పెరిగిన నిత్యావసరాల ధరలు' అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
మహిళలకు ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ..'మహిళలకు ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిత్యావసరాల ధరలను పెంచి కుటుంబాలపై జగన్‌రెడ్డి భారం మోపారు. పన్నులు, ధరల పెంపు ద్వారా వచ్చిన డబ్బునే సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు తెరిచి మహిళల పసుపు కుంకుమలతో చెలగాటమాడుతున్నారు. దిశ చట్టం ద్వారా ఏ ఒక్కరికీ శిక్షపడలేదు. మహిళా హోంమంత్రి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు’ అని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. వైకాపా పాలనలో మహిళలకు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని దుయ్యబట్టారు. సీపీఐ ప్రతినిధి దుర్గా భవాని ప్రసంగిస్తూ అమూల్ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చి మహిళా పాడిరైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నాయకురాలు దుర్గా ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి పేదలు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆరోపించారు.
లోక్‌సత్తా పార్టీ నాయకురాలు మాలతీరాణి ప్రసంగిస్తూ.. హోం మంత్రిగా మహిళే ఉన్నా, రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉన్నా ఎవరికీ న్యాయం జరగట్లేదని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి చెందిన మహిళా రైతులు కంభంపాటి శిరీష, జమ్ముల శైలజ మాట్లాడుతూ రాజధాని ఉద్యమం కొనసాగిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
Antarvedi woman: ఐరాస ఆన్లైన్ సదస్సుకు.. అంతర్వేది మహిళ ఎంపిక!