TS MLC Banda Prakash oath: తెరాస నాయకుడు బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో.. ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రకాశ్‌తో శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏకగ్రీవంగా..
ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల్లో ఐదుగురు ఈ నెల 2 న ప్రమాణ స్వీకారం చేశారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ సమావేశాల దృష్ట్యా ఆ రోజు బండ ప్రకాశ్ గైర్హాజరు అయ్యారు. కాగా.. రాజ్యసభ సభ్యత్వానికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అదే రోజు రాజీనామా చేశారు.
రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామాను సమర్పించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో నేడు ఆయన.. ప్రమాణ స్వీకారానికి చేసి, బాధ్యతలు స్వీకరించారు.
రాజ్యసభ సభ్యునిగా 2024 మార్చి వరకు బండ ప్రకాశ్ పదవీ కాలం ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్ఠానం ఎంపిక చేసింది. అనంతరం ఆయన ఏకగ్రీవంగా పదవికి ఎంపికయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని బండ ప్రకాశ్ తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
'పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్.. నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వరిస్తాను.' -బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ
ఇదీ చదవండి: CM Jagan on OTS : ఆ విషయంలో బలవంతం చేయబోం : సీఎం జగన్