రాష్ట్రాన్ని తగలబెట్టేందుకు జగన్ రెడ్డి తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో పరీక్షలు నిర్వహించాలనుకోవడం ఓ భాగం మాత్రమేనని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu) దుయ్యబట్టారు. కరోనా తీవ్రతలో ప్రత్యక్ష పోరాటాలకు అవకాశం లేని పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు నారా లోకేశ్(Nara Lokesh) డిజిటల్ వేదిక ద్వారా ఎంతో అనుభవం ఉన్న నాయకుడిలా పోరాటం చేశారని ప్రశంసించారు.
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల రద్దుతో భవిష్యత్తు కార్యాచరణపై తెదేపా యువ నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. మానవత్వమున్న ఏ ప్రభుత్వమైనా విద్యార్థుల ప్రాణాలు గురించి ఆలోచించి.. సుప్రీంకోర్టు చెప్పేవరకు ఆగకుండా పరీక్షలు రద్దు చేసేదని రామ్మోహన్ తెలిపారు. జగన్ రెడ్డిని మూర్ఖుడు అనేందుకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలన్నారు. లోకేశ్(Nara Lokesh) పోరాడుతున్నారు కాబట్టి పరీక్షలు రద్దు చేయకూడదని విద్యార్థుల ప్రాణాలు బలిపెట్టాలని చూశారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తీసుకునే తప్పుడు నిర్ణయాలు మార్చే శక్తి రాజ్యాంగ వ్యవస్థలకు ఉందని లోకేశ్ పోరాటంతో రుజువైందని స్పష్టం చేశారు.
రాష్ట్ర పరిస్థితి చూస్తే జాలేస్తోంది: అఖిల ప్రియ
మాజీమంత్రి భూమా అఖిలప్రియ(Bhuma Akhilapriya) మాట్లాడుతూ.. తెదేపా హయాంలో ఆంధ్రప్రదేశ్‌ని చూసి గర్వపడే పొరుగు రాష్ట్రాలు వైకాపా ప్రభుత్వంలో రాష్ట్ర దుస్థితిని చూసి జాలి పడుతున్నాయని వెల్లడించారు. 3నెలల పాటు పరీక్షలు ఉంటాయో లేదోనని విద్యార్థులు పడిన ఒత్తిడి తలచుకుంటే ఎంతో బాధనిపిస్తోందన్నారు. ప్రజా సమస్యల పట్ల ఎవరు పోరాడుతున్నారో అంతా గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువనాయకులు గౌతు శిరీష, కిమిడి నాగార్జున, కిడారి శ్రావణ్, చింతకాయల విజయ్, ఆదిరెడ్డి వాసు, గ్రీష్మ, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవినేని చందు, హరీష్ బాలయోగి, కేశినేని శ్వేత, బండారు అప్పలనాయుడు, శ్రీరామ్ చినబాబు, ప్రణవ్ గోపాల్, కోడెల శివరాం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: