విశాఖ ఉక్కు గురించి నలుగురిని విమానాశ్రయానికి పిలిపించుకుని మాట్లాడిన సీఎం.. రాష్ట్ర ప్రజల్ని అవమానించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ఈ సమస్య ఆ నలుగురిది మాత్రమే కాదని.. తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించినదని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తనకున్న ప్రణాళిక ఏమిటో ముఖ్యమంత్రి తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమంతో తనకేం సంబంధం లేదన్నట్లుగా సీఎం జగన్ వ్యవహరించటం సరికాదన్నారు. పోస్కో కంపెనీతో చేసుకున్న రహస్య ఒప్పందమే జగన్ మౌనానికి కారణమని ఆరోపించారు. పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు రహస్యంగా కలిశారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి విశాఖలో పాదయాత్రలు కట్టిపెట్టి, దిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేయాలన్నారు. ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్న స్వామీజీ కాళ్లపై మోకరిల్లటానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్లటమేంటని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండీ... విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో... 'వాల్తేరు' అనుబంధం తెలుసా..?