విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న బంద్కు అమరావతి రైతులు మద్దతు తెలిపారు. రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కృష్ణాయ పాలెం, మందడం, వెలగపూడి తుళ్లూరులో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
సచివాలయానికి వెళ్లే మార్గంలో మహిళలు, రాజధాని ఐకాస నేతలు, కాంగ్రెస్ నాయకులు మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోవటంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. రైతులు, పోలీసులకు మధ్యా వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుని నిరసిస్తూ.. ఓ రైతు రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ.. రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్