Yadadri Temple: తెలంగాణలోని యాదాద్రి క్షేత్రంలో పునర్నిర్మిత పంచనారసింహుల దివ్యాలయ ఉద్ఘాటన పర్వానికి యాడా, ఆలయ నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి వారంపాటు కొండపై ఉన్న బాలాలయంలో పంచకుండాత్మక హోమం జరుగుతుందని ఆలయ ఈవో గీత మంగళవారం తెలిపారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణతోపాటు కలశాల సంప్రోక్షణను నిర్వహిస్తామన్నారు. తర్వాత భక్తులను స్వయంభువుల దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు.
Yadadri Temple Reopening : చినజీయర్‌స్వామి గతంలో తెలిపిన ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుందని ఈవో అన్నారు. ఈ నెల 21 నుంచి మొదలయ్యే హోమాది పూజల పూర్తి వివరాలను రెండ్రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. ఆర్జిత పూజల్లో భాగంగా బాలాలయంలో కొనసాగుతున్న స్వామి నిత్యకల్యాణోత్సవాలను పాతగుట్ట అనుబంధ ఆలయానికి తరలించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఇంకా రెండ్రోజులు(బుధ, గురు) మాత్రమే బాలాలయంలో నిత్యకల్యాణాలు జరుగుతాయని, ఈ నెల 18(శుక్రవారం) నుంచి పాతగుట్టలో శ్రీస్వామి, అమ్మవారల కల్యాణ మొక్కులను తీర్చుకోవచ్చని వెల్లడించారు.
నిత్య కల్యాణోత్సవాలకు శ్రీకారం
వార్షిక బ్రహ్మోత్సవాలకు తెరపడటంతో మంగళవారం బాలాలయంలో నిత్యకల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు ఈవో తెలిపారు. హుండీల్లో 18 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలతో ఆలయానికి భారీ ఆదాయం సమకూరిందని చెప్పారు. భక్తుల ద్వారా రూ.91,19,982 నగదు, 50 గ్రా. మిశ్రమ బంగారం, 2100గ్రా. వెండి సమకూరిందని అన్నారు.