భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. భాజపా అధ్యక్షుడుగా నియమితులైనందుకు సోము వీర్రాజుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పవన్ కల్యాణ్ శాలువా కప్పి సత్కరించారు. ఏపీలో భాజపా, జనసేన కలిసి పనిచేయడంపై సమాలోచనలు చేశారు.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీ కలసికట్టుగా ముందుకు వెళ్తాయి. అందుకు అవసరమైన ఉమ్మడి కార్యాచరణను త్వరలో రూపొందించుకొని అడుగులు వేస్తాం. భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజుతో... అమరావతిలో రైతుల ఆందోళనలు, రాష్ట్ర ఆర్థిక స్థితి, కేంద్ర నిధులను రాష్ట్రంలో వ్యయం చేస్తున్న తీరు, వర్తమాన రాజకీయ స్థితిగతులు తదితర అంశాలపై చర్చించాం. పవన్ కల్యాణ్, జనసేన అధినేత
రైతులకు అండగా ఉంటాం : సోము వీర్రాజు
ఆర్థికంగా బలపడేందుకు అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని... అన్ని విధాలుగా అభివృద్ధి చెందించే సంకల్పంతో జనసేన, భాజపా ఉన్నాయని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని చెప్పారు. కేంద్ర ఆలోచనలను మిళితం చేసి... కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్న తీరు, ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలను ప్రజల ముందుకు తీసుకువెళ్తామన్నారు. 2024నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దేందుకు ఒక ప్రణాళిక తీసుకుంటామని చెప్పారు. అమరావతి విషయంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.... రైతులకు సంబంధించిన అంశాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారికి ఏ విధమైన సాయం చేయగల అవకాశం ఉందో ఆలోచన చేస్తామని సోము వీర్రాజు అన్నారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు పలువురు నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. గురువారం చిరంజీవిని కలిసిన ఆయన...ఇవాళ హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతలు సీఎం రమేశ్‌తో పాటు మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 11న సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: