అభివృద్ధికి అమడ దూరంలో ఉండే గిరిజనుల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. మరి వాటిని పొందాలన్నా...చదువుకోవాలన్నా ముందు ఊరి నుంచి బయటకు రావాలి. అందుకు మంచి రహదారి అవసరం. కానీ సరైన దారి లేక ఎన్నో గిరిజన గ్రామాలు ప్రగతిఫలాలను పొందలేకపోతున్నాయి. విశాఖ జిల్లా హుకుంపేట మండలం ఎగమాలపాడు పంచాయతీలోనూ అదే పరిస్థితి. రహదారులు కావాలని 35 ఏళ్లుగా గిరిజనం కోరుతున్నా పట్టించకున్నానాథుడే లేడు. ఎన్నాళ్లీ వెతలని భావించిన ఎగమాలపాడు పంచాయతీ కొట్నాపల్లివాసులు.. ఎవరికోసమో ఎదురుచూడకుండా రహదారి నిర్మాణం కోసం ఇంజినీర్లుగా మారారు. శ్రమనే మేథస్సుగా మార్చి చూడచక్కని దారిని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఉపాధి పథకంలో చేర్చాలని వినతి
రెండు నెలలుగా ఈ భగీరథ ప్రయత్నం సాగుతోంది. 15 అడుగుల వెడల్పు మేర కొండ మట్టితో చదును చేస్తున్నారు. కొండ ప్రాంతంలో అడ్డొచ్చిన బండల్ని అంతా కలిసి ఓ పట్టుపట్టారు. మూలమలుపుల్లో రాళ్లు పేర్చుకుంటూ లైనింగ్ కూడా చేస్తున్నారు. రెండునెలలగా పనులు జరుతూనే ఉన్నాయి. వర్షాలనూ లెక్కచేయకుండా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇప్పటివరకు 3 కిలోమీటర్ల వరకు రహదారి నిర్మించుకున్నారు.
ఈటీవీ-ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం
ఎగమాలపాడు శ్రమజీవుల కష్టాన్ని"ఊరికి మొనగాళ్లు" పేరిట ఈటీవీ-ఈటీవీ భారత్ కథనం ప్రసారం చేసింది. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. రహదారిని ఉపాధి పనుల్లో చేరుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర పూర్తి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే గిరిజనులు కుటుంబ సమేతంగా శ్రమ తోటి తయారుచేసిన రహదారికి 3 వేల 444 పనిదినాలు కల్పించి 9 లక్షల 35 వేల 440 రూపాయల నగదును చేసిన పనికి విడుదల చేశారు. ఈటీవీ-ఈటీవీ భారత్ కథనంతో అధికారులు దిగి రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా ఈటీవీ-ఈటీవీ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో దరఖాస్తులు బుట్టదాఖలు అయ్యాయని ఒక్క ఈటీవీ-ఈటీవీ భారత్ కథనంతో అధికార గణం ముందుకు వచ్చిందని విద్యార్థి హక్కుల సంఘం ప్రతినిధి కృష్ణా రావు తెలిపారు.
ఇదీ చదవండి