గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను అక్టోబరు నుంచి ఖరారు చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం మంది సచివాలయ సిబ్బంది శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని, వారందరి సర్వీసులు రెగ్యులర్ అవుతాయని తెలిపారు.
అనుత్తీర్ణులైన ఉద్యోగుల కోసం సెప్టెంబరులో మరో శాఖాపరమైన పరీక్ష పెట్టాలని ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తామని, అక్టోబరు 2న వీలైనంత ఎక్కువ మంది సిబ్బంది రెగ్యులర్ అవుతారని తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఆర్టీసీ భవన్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
‘సచివాలయాల్లో 8 విభాగాల ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షల్లేవు. వారి సర్వీసును నేరుగా క్రమబద్ధీకరించి.. పదోన్నతుల సమయంలో పరీక్ష నిర్వహించాలని కోరుతున్నాం. మహిళా సంరక్షణ కార్యదర్శుల్లో ఇష్టం ఉన్నవారే పోలీసు విభాగంలోకి వెళ్లడానికి ఆప్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సాధారణ బదిలీలు ఉండే అవకాశముందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. కరోనా కారణంగా నిలిచిపోయిన బదిలీ ప్రక్రియను సెప్టెంబరు- అక్టోబరులో చేపట్టాలని సీఎంను కోరామని వివరించారు.
అధ్యక్షుడిగా అంజన్‌రెడ్డి
రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా భీమిరెడ్డి అంజన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బత్తుల అంకమ్మరావు ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలోని ఆర్టీసీహౌస్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మొత్తం 35 మందితో కార్యవర్గం ఏర్పడినట్లు సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. నవంబరులో లక్ష మంది ఉద్యోగులతో ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించింది.