జనరిక్ మందుల వినియోగంపై.. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఇందుకు సాంకేతికతను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. జనరిక్ మందుల కేంద్రాలు ఏర్పాటుకు పీహెచ్సీ, సీహెచ్‌సీ, సివిల్ ఆసుపత్రుల్లో అద్దెలేని తగు స్థలాలను కల్పించాలని పేర్కొన్నారు. వివిధ కేంద్ర పథకాల అమలుపై కొన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు.
కడప,చిత్తూరు జిల్లాల మీదుగా నిర్మించే 268 కి.మీ.ల కడప - బెంగుళూరు పొడవైన నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనుల ప్రగతిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సీఎస్‌లను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి కడప జిల్లాలో 56.04 హెక్టార్ల భూమికి అటవీ క్లియరెన్స్ రావాల్సి ఉందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మోదీ.. వెంటనే క్లియరెన్స్ వచ్చేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ బ్రాడ్ గేజ్ రైల్వే నిర్మాణానికి సంబంధించి కడప జిల్లాలో 815 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటే 163 హెక్టార్ల సేకరణకు అవార్డ్ పాస్ చేశామని.. మిగతా భూసేకరణ వివిధ దశల్లో ఉందని ప్రధానికి సీఎస్ నివేదించారు. ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని.. జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడంపై దృష్టి సారించామని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రధానికి వివరించారు.
రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్, బోర్డ్ ఆసుపత్రులు జనరిక్ మందుల వినియోగంలో మంచి ఫలితాలు సాధించాయని.. మిగతా ఆసుపత్రుల్లోనూ వీటి వినియోగంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చామని చెప్పారు.
ఇదీ చదవండి: