ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతో పీజీ వైద్య, దంత విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఓ అంగీకారానికి వచ్చినట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. మూడేళ్లకు విద్యార్థుల నుంచి మరో 45 వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తామని, అందుకు విద్యార్థులు సైతం అంగీకరించారని కళాశాలల యాజమాన్యాల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. 45 వేల రూపాయలు వసూలు నిబంధనల్లో ఎక్కడా లేదని విద్యార్థుల తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి అభ్యంతరం లేవనెత్తారు. అదనంగా చెల్లించే సొమ్ము కూడా కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరు న్యాయవాదుల వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. పీజీ వైద్య, దంత విద్య సీట్లలో చేరే నిమిత్తం ప్రవేశ రుసుము చెల్లించేందుకు ప్రైవేటు వైద్య, దంత కళాశాలలు అనుమతించడం లేదంటూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు వైద్య కళాశాలల్లో ఫీజుల్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 29న జారీచేసిన జీవో 56ని సవాలు చేస్తూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఫీజులను తగ్గించడం సరికాదన్నాయి. జీవో 56 ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను అమలు చేయాలని పాత్రికేయుడు తోట సురేశ్ బాబు ఓ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది.
ఇదీ చదవండి : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన పితాని కుమారుడు