తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీలుగా బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్ గుప్తా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రిమండలి సిఫార్సు మేరకు ఈ ముగ్గురి నియామకానికి ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.
రాష్ట్ర శాసనమండలిలో ఎన్నికైన తొలి ఎమ్మెల్సీగా గోరటి వెంకన్న గుర్తింపు పొందగా... ఈయన నియామకంతో మండలిలో ఎస్సీ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది. సారయ్య నియామకంతో బీసీ ఎమ్మెల్సీల సంఖ్య తొమ్మిదికి చేరింది. మండలిలో తొలి ఆర్యవైశ్య సభ్యునిగా దయానంద్ గుర్తింపు పొందారు.
ఈ ముగ్గురు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోనున్నారు. నూతన ఎమ్మెల్సీల నియామకంతో మండలిలో మొత్తం 40 స్థానాలు భర్తీ అయినట్లైంది. తెరాస నుంచి 35 మంది, మజ్లిస్ రెండు, ఉపాధ్యాయ, కాంగ్రెస్, భాజపా నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.