ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో వందల మందికి ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో 'ఆన్‌లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్'(Online medical crowdfunding) ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది. కరోనా, బ్లాక్‌ఫంగస్ లేదా ఇతరత్రా తీవ్ర వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు సంబంధించో చికిత్స కోసం ఎంతోమంది బాధితులు, వారి కుటుంబసభ్యులు తమ వద్ద అందుబాటులో ఉన్న, అప్పటి వరకూ పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు.
బీమా సదుపాయం వంటివీ వినియోగిస్తున్నారు. కొంతమంది ఆస్తులూ అమ్ముకుంటున్నారు. అయినా ఇంకా చికిత్సకు లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తే దిక్కుతోచని స్థితే. కొందరైతే అప్పులు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నా.. కోలుకున్నాక ఆ రుణం తీర్చలేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తల్లకిందులవుతున్న పేద, మధ్యతరగతి వర్గాల వారికి 'ఆన్‌లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్' ఓ దారి చూపుతోంది.
ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కొవిడ్ బారిన పడి విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఊపిరితిత్తులు 80 శాతం మేర దెబ్బతిన్నాయి. తొలుత స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా.. పరిస్థితి మెరుగుపడకపోవటంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. పొదుపు చేసుకున్న సొమ్ముకు తోడు బంధుమిత్రుల నుంచి అప్పు తెచ్చింది కలిపి ఇప్పటికే దాదాపు రూ.20 లక్షలు ఖర్చయింది. ఆయన పరిస్థితి మెరుగుపడాలంటే మరో రూ.30 లక్షల వరకూ వెచ్చించాలి. అంత సొమ్ము తక్కువ వ్యవధిలో ఎలా సమకూర్చుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయన కుటుంబానికి ‘ఆన్‌లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ దారి చూపించింది. గత రెండు రోజుల్లోనే రూ.2 లక్షల వరకూ విరాళాలు వచ్చాయి. ఇంకా దాతలు స్పందిస్తూనే ఉన్నారు.
* బాధితులకు వైద్య ఖర్చుల కోసం ఆన్‌లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ విధానంలో దేశ, విదేశాల నుంచి విరాళాల సమీకరణకు మిలాప్, కెట్టో, ఇంపాక్ట్‌గురు వంటి సంస్థలు సేవలందిస్తున్నాయి.
* చికిత్సకు అవసరమైన డబ్బును వెచ్చించే పరిస్థితి లేదా స్థోమత బాధితులకు లేనప్పుడు.. వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఎవరైనా సరే నిధుల సమీకరణ చేపట్టొచ్చు.
* మిలాప్, కెట్టో, ఇంపాక్ట్‌గురు తదితర సంస్థల వెబ్‌సైట్‌ల్లోకి వెళ్లి బాధితుడి పేరు, చిత్రాలు, ఆరోగ్య సమస్య, చికిత్సకు సంబంధించిన పత్రాలు, వైద్యుల నివేదికలు వంటివి పొందుపరచాలి.
* వైద్యానికి ఎంత ఖర్చవుతుందో, విరాళాల రూపంలో ఎంత అవసరమో చెప్పాలి. బాధితులు లేదా వారి కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి వివరాలివ్వాలి.
* ఎవరి కోసం నిధులు సమీకరిస్తున్నారో వారి పేరు, వివరాలతో ఓ పోస్టును రూపొందించి ఆయా సంస్థలు వారి వెబ్‌సైట్‌లో ఉంచుతాయి. తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ విస్తృత ప్రచారం కల్పిస్తాయి. ఆ పోస్టుకు సంబంధించిన లింక్‌నూ బాధితుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పరిచయస్తులు షేర్ చేయొచ్చు. వీటి ఆధారంగా బాధితులకు తెలిసిన వారితో పాటు తెలియనివారి నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు వచ్చే అవకాశం ఉంటుంది.
* ఎంత నిధులు సమకూరాయి? అనే వివరాల్ని బాధితుల తరఫున నిధుల సమీకరణ పోస్టు పెట్టిన వారు ఎప్పటికప్పుడు ఆయా సంస్థల వెబ్‌సైట్లలోకి వెళ్లి తెలుసుకోవచ్చు. వైద్యఖర్చులకు అవసరమైన నిధిలో ఎంత పోగయ్యిందో దాతలకూ కనిపిస్తుంది. కొందరికి రెండు, మూడు రోజుల్లోనే నిధులు సమకూరుతాయి.
* బాధితులు ఒకేసారి మొత్తం నిధిని తీసుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు మెడికల్ బిల్లుల్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచి వారికి సమకూరిన నిధి నుంచి డ్రా చేసుకోవచ్చు.
దాతలకు పన్ను మినహాయింపు
* ఆన్‌లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్‌కు నిధులిచ్చే దాతలకు పన్ను మినహాయింపు వర్తింపజేస్తున్నారు.
* కొన్ని సంస్థలు ఈ సేవలందించేందుకు నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నాయి. అవి కూడా దాతల నుంచి తీసుకుంటున్నాయి. ఉచిత సేవలందించే సంస్థలూ ఉన్నాయి.
* కొంతమంది బాధితులకు అవసరమైన నిధి రెండు, మూడు రోజుల్లోనే సమకూరుతోంది. మరికొందరికి ఎక్కువ రోజుల సమయం పడుతోంది.
* కొవిడ్ వేళ కేవలం కొన్ని సంస్థలు.. ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేందుకు, కొవిడ్‌కేర్ కేంద్రాల ఏర్పాటుకు, పీపీఈ కిట్లు అందించేందుకు, కొవిడ్ బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు ఇలా విభిన్న అవసరాలకు కూడా నిధులు సమీకరిస్తున్నాయి.
మీకు తెలుసా!
మన దేశంలో ప్రజలు ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రైవేటు రంగంలో వైద్యానికి ఖర్చుపెడుతున్నారు. ఇందులో 60 శాతం మాత్రమే బాధితుల పొదుపు సొమ్ము. మిగిలిన 40 శాతం అప్పులు చేసి, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఇచ్చినదానిలో నుంచే ఖర్చు పెడుతున్నారని క్రౌడ్‌ఫండింగ్ సంస్థలు చెబుతున్నాయి. ఆ లోటు భర్తీ చేయటానికి క్రౌడ్ ఫండింగ్ ఉపయోగపడుతుందని పేర్కొంటున్నాయి.
ఆన్‌లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ చేసే కొన్ని సంస్థల వెబ్‌సైట్ల వివరాలు
* milaap.org
* ketto.org
* impactguru.com
ఇదీ చదవండి: