రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ, చెన్నై) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు రుజువైతే హామీ ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపగలమని, ఎవరు ఉత్తర్వులు ఉల్లంఘించినా ఇది తప్పదని పేర్కొంది. ఎత్తిపోతల పథకంలో పనులకు సంబంధించి తాజా నివేదిక సమర్పించాలంటూ ప్రాంతీయ అటవీ పర్యావరణ శాఖ (బెంగళూరు)కు, కృష్ణానదీ యాజమాన్య బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఏపీని ఆదేశిస్తూ విచారణను జులై 12కి వాయిదా వేసింది.
ఎన్జీటీకి ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ జి.శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఎన్జీటీ జ్యుడిషియల్ సభ్యులు జస్టిస్ రామకృష్ణన్, సాంకేతిక సభ్యులు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేందుకు వీలుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను అనుమతుల్లేకుండా చేపట్టబోమని ఏప్రిల్ 22న ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. దీనికి విరుద్ధంగా పర్యావరణ అనుమతుల్లేకుండా పనులను కొనసాగిస్తోందన్నారు. ఆ రాష్ట్ర సీఎస్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరారు.
సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించడానికి వీలుగా 10 రోజుల గడువు కావాలని ఏపీ తరఫు న్యాయవాది దొంతి మాధురిరెడ్డి కోరారు. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేవలం డీపీఆర్ కోసం ప్రాథమిక పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పారు. పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని చెప్పారు. ప్రాజెక్టు పనులను చేపట్టలేదని స్పష్టం చేశారు. తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ పేరుతో ప్రధాన ప్రాజెక్టు పనులు చేపడుతోందన్నారు. డీపీఆర్ కోసం ప్రాథమికంగా పనులు చేస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఆ పేరుతో ప్రాజెక్టు ప్రధాన పనులనే చేపట్టిందన్నారు.వెయ్యి దాకా టిప్పర్లు, హిటాచీలు పనిచేస్తున్నాయన్నారు. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం కాకపోతే ఇన్ని వాహనాలెందుకన్నారు. కేంద్రంతోపాటు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఏపీ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు.
ఎన్జీటీ ఆదేశాల మేరకు పనుల తనిఖీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. ఇందులో ప్రభుత్వం తరఫున కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్‌లో ఏపీ కౌంటరు దాఖలు చేశాక చూద్దామని పేర్కొంది. ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు తేలితే తాము సహించబోమని, ప్రాసిక్యూషన్‌కు ఆదేశించగలమని, సీఎస్‌ను జైలుకు పంపగలమని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ·కౌంటరు దాఖలు చేయాలని ఏపీని ఆదేశించింది. అదేవిధంగా పనులపై తాజా నివేదికను సమర్పించాలంటూ బెంగళూరులోని అటవీ పర్యావరణ ప్రాంతీయశాఖను ఆదేశిస్తూ విచారణను జులై 12వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: డిజిటల్ పేమెంట్స్.. మరింత సురక్షితంగా