Ministers discussion with CPS employees: మంత్రి బొత్స నివాసంలో సీపీఎస్ ఉద్యోగులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సమావేశంలో మళ్లీ పాత అంశాలనే చర్చకు తీసుకువచ్చారని ఉద్యోగ సంఘాల నేతలన్నారు. సీపీఎస్ అమలు చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని మంత్రులు బుగ్గన, బొత్స వెల్లడించారన్నారు. అయితే సీపీఎస్‌పై ఉద్యోగుల ఆందోళనలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం కొనసాగుతుందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత రామాంజనేయులు తెలిపారు.
ఓపీఎస్ అమలు సాధ్యం కాదని తెలిసి హామీ ఎందుకిచ్చారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత అప్పలరాజు ప్రశ్నించారు. జీపీఎస్ గురించి మాత్రమే చర్చిద్దామంటే మమ్మల్ని ఎందుకు పిలిచారన్నారు. ప్రభుత్వ తీరుతో సీపీఎస్ ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు కంట్రిబ్యూషన్ ఆరు నెలలుగా చెల్లించడం లేదని.. మోసపోయామనే భావనలో సీపీఎస్ ఉద్యోగులందరూ ఉన్నారన్నారు. మా ఆందోళనలను అణచివేసినంత మాత్రాన మా ఆవేదన చల్లారదని స్పష్టం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామంటున్నా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఏడేళ్ల నుంచి సభ పెట్టుకుంటున్నామని.. ఇప్పుడే ఆంక్షలు ఎందుకు? అని అప్పలరాజు ప్రశ్నించారు. సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎస్ ఉద్యోగులందరూ బ్లాక్‌డే నిర్వహిస్తారని తెలిపారు.
అయితే జీపీఎస్ విధానంలో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం సిద్ధమని మంత్రి బొత్స తెలిపారు. ఓపీఎస్ విధానంలోనూ కొంత తగ్గేందుకు ఉద్యోగులు ఒప్పుకున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను నెరవేర్చిందన్న బొత్స.. ఇంకా నెరవేర్చని 5 శాతం హమీల్లో సీపీఎస్ రద్దు ఒకటి అని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపైనా చర్చకు సిద్ధమని బొత్స అన్నారు. ఓపీఎస్ ఆర్థికభారంగా మారుతుందనే కేంద్రం సీపీఎస్ తెచ్చిందన్నారు. ఉద్యోగులతోపాటు 5 కోట్ల మంది అవసరాలను ప్రభుత్వం చూడాలన్నారు. గురువులను గౌరవించేందుకే ప్రభుత్వం ఎడ్యుఫెస్ట్ నిర్వహిస్తోందని.. సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలను అడ్డుకునేందుకు కాదని మంత్రి బొత్స తెలిపారు.