Leaders on Amaravati capital issue in Supreme Court: రాజధానిపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టంచేశారు. చట్టసభల అధికారాలను ప్రశ్నించేలా హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదన్నారు. కేంద్రం చేసిన చట్టానికి పార్లమెంటులోనే సవరణలు జరగాలని మాత్రమే చెప్పిందని అన్నారు. ప్రభుత్వం వేసిన పిటిషన్ ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురవుతోందని... హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు
"రాష్ట్ర ప్రభుత్వానికి మరో భంగపాటు తప్పదు. చట్టసభలను వక్రీకరించేలా హైకోర్టు తీర్పు ఇవ్వలేదు. దురుద్దేశంతోనే హైకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారు. రాజధాని నిర్మాణం చేపట్టకుండా 6 నెలలు కాలయాపన చేశారు. కాలయాపన చేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు." -కనకమేడల రవీంద్రకుమార్
ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షల్ని సుప్రీంకోర్టు కాదనదని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రైతుల పోరాటం వృథాగా పోదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించేలా సుప్రీంకోర్టులోనూ తీర్పు వస్తుందని తెలిపారు. రైతుల సంకల్పం ముందు ప్రభుత్వ కుట్రలు చాలా చిన్నవని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు.
"ఏపీ ప్రజల ఆకాంక్షలను సుప్రీంకోర్టు కాదనదు. అమరావతి రైతుల పోరాటం వృథాగా పోదు. సుప్రీంలోనూ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పు వస్తుంది. రైతుల సంకల్పం ముందు ప్రభుత్వ కుట్రలు చాలా చిన్నవి." -పయ్యావుల కేశవ్
మూడు రాజధానులపై హైకోర్టు తీర్పు వెలువరించి 6 నెలలు దాటితే ఇప్పుడు సుప్రీంలో సవాల్ చేయడమేంటని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం సమర్థిస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. గతంలో అమరావతికి మద్దతిచ్చిన జగన్.. ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్దాలు వల్లెవేశారని సత్యకుమార్ విమర్శించారు.
"రాజధాని నిర్మించుకోలేని అసమర్థ సీఎంగా నిలిచారు. అభివృద్ధి వికేంద్రీకరణ ముసుగులో విద్వేషాలు కలిగిస్తారా?. హైకోర్టు తీర్పు ఎప్పుడో వస్తే ఇప్పుడు సుప్రీంకి వెళ్లడమేంటి?. సుప్రీంలోనూ మొట్టికాయలు తప్పవనే ఇన్నాళ్లు ఆగారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై అసెంబ్లీలో సీఎం చెప్పినవన్నీ తప్పుడు లెక్కలే. -సత్యకుమార్
ఇవీ చదవండి: