మరోక రోజు గడిస్తే చాలు పోలీసు కానిస్టేబుల్ శిక్షణ పూర్తవుతుంది. తాను కన్న కలలు పాసింగ్ ఔట్ పరేడ్‌తో సాకారం కానున్నాయి. పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఉత్సహంతో సిద్దమవుతోంది ఆ యువతి. అంతలోనే తనను ఈ స్థాయికి చేర్చిన తాత ఇకలేరనే సమాచారంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అల్లారుముద్దుగా వేలుపట్టి నడిపించిన తాత చివరి చూపుకు వెళ్లాలా లేక తాత ఆశయమైన కానిస్టేబుల్ పరేడ్‌లో పాల్గొనాలా అనే ఆలోచనలో పడింది. చివరకు పరేడ్‌లోనే పాల్గొనాలని నిర్ణయించుకుని తాత చివరి చూపును చూడలేకపోయాననే బాధను దిగమింగుకుంది. శుక్రవారం పరేడ్ ముగిసిన తర్వాత.. శనివారం శ్మాశానవాటికకు పోలీసు యూనిఫాంలోనే వచ్చి సెల్యూట్ చేసి కన్నీరుమున్నీరవుతూ నివాళులర్పించడం పలువురిని కలచివేసింది. తాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బోరున విలపించింది ఆ యువతి.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని కార్వాన్ పరిధి పంచబలాయి ప్రాంతానికి చెందిన వెంకటేశ్ కూతురు కీర్తన. మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి నియామకమైంది. ఈమె మేడ్చల్‌లోని పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతోంది. గత శుక్రవారం రోజున శిక్షణ పూర్తైనందున పాసింగ్ ఔట్ పరేడ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరేడ్‌కు సిద్దమవుతుండగా తన తండ్రికి తండ్రి గురువారం తాత బిక్షపతి చనిపోయాడని వార్త అందింది. తెల్లారే పాసింగ్ ఔట్ పరేడ్ ఉన్నందున అంత్యక్రియల్లో పాల్గొనడానికి అధికారులు అంగీకరించలేదు. దీంతో ఆమె గుండె నిబ్బరం చేసుకుని చివరి చూపుకు వెళ్లకుండానే పాసింగ్ ఔట్ పరేడ్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. శనివారం బిక్షపతి అంత్యక్రియలు జరిగిన గణేష్ ఘాట్ శ్మాశానవాటికలో మూడు రోజుల కార్యక్రమానికి పోలీసు యూనిఫాంలోనే కీర్తన హాజరై సెల్యూట్ చేసి నివాళులర్పించింది. బాగోగులకు అండగా నిలుస్తూ మార్గదర్శకంగా నిలిచి.. తాత మమకారాన్ని, మధుర స్మృతులను గుర్తు చేసుకుని రోధించడం ఆమె బంధువులతోపాటు పలువురిని కంటతడి పెట్టించింది.
ఇదీ చూడండి : నల్గొండ విద్యార్థినికి.. ఏపీ ఎంసెట్‌లో 11వ ర్యాంక్