కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా 66% మంది జీవనోపాధి కోల్పోయారు. పట్టణాలకు వలస వచ్చిన కుటుంబాల్లో.. ప్రతి పది మందిలో 8 మందికి జీవనోపాధి పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో పది మందిలో ఆరుగురిపై ఈ ప్రభావం ఉంది. సాధారణ ఉద్యోగుల్లో సగం మందికి పైగా (51%) తక్కువ జీతం పొందారు. కొందరు అసలు జీతమే తీసుకోలేదు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి అజీజ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఫోన్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఏప్రిల్ 24 నుంచి మే 5 మధ్య.. 12 రాష్ట్రాల్లోని సుమారు 5వేల కుటుంబాల నుంచి ఈ వివరాలను సేకరించారు. ‘సమాలోచన’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో 281 కుటుంబాల నుంచి, తెలంగాణలో 329 కుటుంబాల స్థితిగతులపై ఫోన్ సర్వే నిర్వహించారు. వ్యవసాయేతర రంగాల్లో పనిచేసే స్వయం ఉపాధి కార్మికుల ఆదాయం వారానికి రూ.2,240 నుంచి రూ.218కి తగ్గిందని సర్వే పేర్కొంది. రోజువారీ వేతనజీవుల రాబడి రూ.940 నుంచి రూ.495కి పడిపోయిందని వెల్లడించింది. లాక్‌డౌన్‌తో పట్టణాలు కుదేలయ్యాయి. 87% మందికి పని పోయిందని పేర్కొంది. నెలకు రూ.7 వేలు ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై ప్రేమ్‌జీ వర్సిటీ పలు సూచనలు చేసింది.
- ప్రజాపంపిణీ వ్యవస్థను విస్తరించి.. వచ్చే ఆరు నెలలు ఉచితంగా అందించాలి.
- పేద కుటుంబాలకు నెలకు రూ.7వేల చొప్పున రెండు నెలలపాటు నగదు బదిలీ చేయాలి.
- ఉపాధిహామీ, పీఎం ఉజ్వల, ప్రజాపంపిణీ వ్యవస్థల ద్వారా ఎక్కువ మందికి నగదు బదిలీ చేయాలి.
- పట్టణ పేదలపై ప్రభావం చూపించే పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
- ఎక్కువ మందికి ఉపాధిహామీ వర్తింపజేయాలి. పట్టణ పేదలకూ ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాలి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్ష దాటాయ్.. వైరస్‌తో 1,090 మంది మృతి