సివిల్స్ ప్రిలిమ్స్- 2021 ప్రశ్నపత్రంలో హైదరాబాద్, చిత్తూరు జిల్లా మదనపల్లెకు చోటు దక్కింది. యూపీఎస్సీ ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి రెండు ప్రశ్నలడిగింది. ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్, లారెస్ ప్రపంచ క్రీడా అవార్డు, 32వ సమ్మర్ ఒలింపిక్స్ వంటి క్రీడాంశాలపైనా ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అంత కఠినంగానూ.. మరీ సులువుగానూ కాకుండా మధ్యస్థంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. విషయాన్ని ఆకళింపు చేసుకుని, కచ్చితమైన జవాబును గుర్తించే సామర్థ్యమున్న వారికి సులువుగా అనిపించేలా ప్రశ్నలున్నాయని శిక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు.
యూపీఎస్సీ ఆదివారం దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష నిర్వహించింది. ఉదయం 9.30- 11.30 వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2.30- 4.30 వరకూ పేపర్-2 పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి నగరాల్లోని 85 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 36,511 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక సమాచారం ప్రకారం విజయవాడలో 41.11 శాతం, తిరుపతిలో 44 శాతం, విశాఖలో 41 శాతం, అనంతపురంలో 51 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
చరిత్ర, సంస్కృతిపైనే ఎక్కువ
పేపర్-1లో చరిత్ర నుంచి 20, రాజనీతిశాస్త్రం (పాలిటీ) నుంచి 18, ఆర్థిక వ్యవస్థపై 15, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 12, పర్యావరణంపై దాదాపు 20 వరకూ ప్రశ్నలున్నాయి. క్రీడలు, వర్తమాన అంశాలపైనా ప్రశ్నలడిగారు. పేపర్-2లో ఎక్కువగా ప్యాసేజీలు ఇచ్చి వాటి నుంచి ప్రశ్నలు సంధించారు. ఈ ప్యాసేజీలను కఠినమైన ఆంగ్లంతో ఇవ్వడంతో సమాధానాలు రాయడానికి గ్రామీణ అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు తెలిపారు.
విశ్లేషణాత్మకంగా ప్రశ్నపత్రం
పేపర్-1లో విశ్లేషణాత్మక ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయని శిక్షణ రంగ నిపుణులు గోపాలకృష్ణ ‘ఈనాడు’తో చెప్పారు. ‘దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించి చరిత్ర, సంస్కృతి, పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. పేపర్-2 గ్రామీణ నేపథ్యమున్న అభ్యర్థుల్ని కాస్త ఇబ్బంది పెట్టేలా ఉంది. ఆంగ్లంలో నైపుణ్యమున్న వారు త్వరగా సమాధానాలు గుర్తించారు’’ అని వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కటాఫ్ మార్కులు పెరిగే అవకాశముందన్నారు. జనరల్ కేటగిరీలో 99-103, ఈడబ్ల్యూఎస్‌లో 85-90, ఓబీసీ 93-97, ఎస్సీలకు 80-85, ఎస్టీలకు 74-80 వరకూ పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
సులభంగా ప్రశ్నపత్రం
ప్రిలిమ్స్ రెండు ప్రశ్నపత్రాలు కొంత సులభంగానే అనిపించాయి. మెయిన్స్‌కు సులువుగా అర్హత సాధించవచ్చు. పేపర్-2లో రీజనింగ్ విభాగం నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చాయి.- భరద్వాజ్, విజయవాడ
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ఎక్కువగా..
రెండు పేపర్లలోనూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. వివిధ సబ్జెక్టులు, వర్తమాన అంశాలపై పట్టున్నవారికి జవాబులివ్వడం కష్టమేం కాదు.- రాజీవ్, విజయవాడ
ఇదీ చదవండి: దసరా ఉత్సవాలు: నేడు అన్నపూర్ణా, మహాలక్ష్మీదేవి రూపాల్లో అమ్మవారు