కరోనా మూడో దశ సన్నద్ధతపై చేతులెత్తేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా పరిస్థితులపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పలుమార్లు ఆదేశించినప్పటికీ మూడో దశ సన్నద్ధత ప్రణాళికను ఎందుకు సమర్పించడం లేదని ప్రశ్నించింది. సమస్యను ముందుగా గుర్తించి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నామని.. లేదంటే కోర్టు జోక్యం చేసుకుంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఓ వైపు బడులు ప్రారంభమయ్యాయని.. మరో వైపు గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో పిల్లలకు కరోనా సోకకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఒకవేళ మూడో దశ వస్తే రాష్ట్రవ్యాప్తంగా నిలోఫర్ ఆస్పత్రిపైనే ఆధారపడకుండా.. జిల్లాల్లోనూ పిల్లల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగు పరచాలని ఆదేశించింది. నిపుణుల కమిటీ జులై 15నే సమావేశమై.. పలు సూచనలు సిఫార్సు చేసిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. నిపుణుల కమిటీ సిఫార్సుల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 'సాక్షి'పై కోర్టు ధిక్కరణ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ