AP SCHOOLS: విద్యా హక్కు చట్టానికి భారీగా సవరణలు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కిలోమీటరు దూరంలో ఉండాల్సిన 3, 4, 5 తరగతులను 3 కి.మీ. దూరం వరకూ ఉండవచ్చని సవరణ తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ కనుమరుగు కానుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మార్పులు ఇలా..
- ప్రస్తుతం కిలోమీటరులోపు 1-5 తరగతులు ఉండగా.. ఇక నుంచి కిలోమీటరులోపులో పూర్వ ప్రాథమిక విద్య(పీపీ)-1, 2 (ఎల్‌కేజీ, యూకేజీ), ఒకటి, రెండు తరగతులు (ఫౌండేషనల్ బడి), పూర్వ ప్రాథమిక విద్య-1, 2, ఒకటి నుంచి ఐదు తరగతులు (ఫౌండేషనల్ ప్లస్ బడి) ఉంటాయి. 3-8 తరగతులుండే ప్రీ హైస్కూల్, ఉన్నత పాఠశాలలు 3.కి.మీల వరకూ దూరంలో ఉంటాయి.
- అంగన్‌వాడీ కేంద్రాలను సైతం 1 కి.మీ. దూరం వరకూ ఉంచవచ్చని నిబంధనలు సవరించారు. వీటిని శాటిలైట్ ఫౌండేషనల్ పాఠశాలలుగా పిలుస్తారు. వీటిల్లో పీపీ-1, 2 నిర్వహిస్తారు.
- ఫౌండేషనల్ బడిలో పీపీ-1, 2, ఒకటి రెండు తరగతులు, ఫౌండేషనల్ ప్లస్ స్కూల్‌లో పీపీ-1, 2తోపాటు 1-5 తరగతులు ఉంటాయి. ప్రీ హైస్కూల్‌లో 3- 7 లేదా 8 తరగతులు నిర్వహిస్తారు.
- ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రస్తుతం 1-8 తరగతులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తుండగా.. ఇక నుంచి ఫౌండేషనల్, ఫౌండేషనల్ ప్లస్, ప్రీ హైస్కూల్, ఉన్నత పాఠశాలలుగా మార్పు చేస్తారు.
రవాణా భత్యం.. పాఠశాలలు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే పిల్లలకు రవాణా భత్యం ఇస్తారు. బడులను దూరంగా పెట్టి రవాణా భత్యం ఇవ్వడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగమే
ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ఈ సంస్కరణకు ప్రభుత్వం పూనుకుందని ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వరరావు, షేక్‌సాబ్జీ విమర్శించారు. ‘ఈ సంస్కరణల కారణంగా 3, 4, 5 తరగతుల పిల్లలు 3 కిలోమీటర్ల దూరంలోని ప్రీహైస్కూల్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇది పిల్లల ప్రాథమిక హక్కుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. తక్షణమే ఈ సవరణలను ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఏకమై దీన్ని తిప్పికొట్టాలి’ అని విజ్ఞప్తి చేశారు. విద్యా హక్కు చట్టం సవరణలు ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, ప్రసాద్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విద్యాహక్కు చట్టాన్ని సవరించిందని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: