జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం పెద్దంపేట వాగుకు భారీగా వరద రావడంతో కరెంటు స్తంభాలు, లైన్లు నేలకూలాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
ఇదే జిల్లాలోని పలిమెల మండలం 10 రోజులుగా అంధకారంలో మగ్గుతోంది. 13 గ్రామాలకు కరెంటు లేకుండా పోయింది. దోమలతో సహవాసం చేస్తున్నామని ఆ గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్తు లేక మోటార్లు పనిచేయలేదు. పైపులు వరదలో కొట్టుకుపోవడంతో భగీరథ నీళ్లు రాక తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని బాధితులు అధికారులను వేడుకున్నారు.
భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చింతిర్యాల, ఆనందాపురం, నెల్లిపాక, రామచంద్రాపురం, అమీర్థ, అమ్మగారిపల్లి, బట్టీలగుంపు తదితర గ్రామాల్లో చీకటి రాజ్యమేలుతోంది.
Flood Effect on Villages in Telangana : అధిక వర్షాలు, వరదలతో కరెంటు సరఫరా లేక వరదపీడిత ప్రాంతాల్లో వేల మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. గోదావరి వరదలతో 243 గ్రామాల్లో, ఇతర ప్రాంతాల్లో గాలులు, వర్షాలతో సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకొరగడంతో వాటిని తిరిగి నిలబెట్టి సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. వరదల వల్ల ఇప్పటివరకూ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు చెందిన రూ.30 కోట్లకు పైగా విలువైన సామగ్రి దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో వరదలు పెద్దగా లేనందున నష్టాలు ఎక్కువగా లేవని డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి చెప్పారు.
ఉత్తర తెలంగాణలో అపారనష్టం.. గోదావరి వరదలతో పాటు, కుంభవృష్టి వర్షాల వల్ల ఉత్తర తెలంగాణ డిస్కంకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలాచోట్ల స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్లు నీటమునగడంతో వాటిని మార్చాల్సిన అవసరమేర్పడింది. భద్రాద్రి జిల్లాలో నష్టం అధికంగా ఉండటంతో ప్రత్యేకంగా ఒక సంచాలకుడి(డైరెక్టర్)ని భద్రాచలంలో నియమించి మరమ్మతు పనులను పర్యవేక్షించాలని ఉత్తర డిస్కం ఆదేశించింది. ఇంకా ఒక్క భద్రాద్రి జిల్లాలోనే 17 గ్రామాలకు కరెంటు సరఫరా పునరుద్ధరించాల్సి ఉందని సంచాలకుడు వెంకటేశ్వరరావు చెప్పారు.
Flood Effect on Villages in Bhupalpally : కొన్ని ప్రాంతాల్లో వరదలు విద్యుత్ లైన్లను సైతం ముంచేసి ప్రవహించడంతో వరదనీటిలో కొట్టుకువచ్చిన కలప, ఇతర చెత్తా తీగలపై చుట్టుకుపోయింది. వాటిని తొలగించకుండా కరెంటు ఇస్తే ప్రమాదమని ఆపేశారు. నీటిలో మునిగి ఉన్న సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు పడవల్లో వెళ్లి నష్టాలు అంచనా వేసి మరమ్మతులు చేస్తున్నారు. వాజేడులో మునిగిన ఒక ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు పడవలో వెళ్లి మరమ్మతు చేశారు. పొలాల ముంపు కారణంగా వ్యవసాయ బోర్లకు కరెంటును రైతులు ఇప్పటికిప్పుడు అడగటం లేదు. దీంతో గృహాలకు సరఫరా పునరుద్ధరణపై దృష్టి పెట్టినట్లు ఉత్తర డిస్కం సీఎండీ అన్నమనేని గోపాలరావు చెప్పారు.
మూడు రోజులుగా కరెంటు లేదు.. "గోదావరి వరద ముంపు పేరుతో గత 3 రోజులుగా కరెంటు సరఫరా నిలిపివేయడంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నాం. తాగునీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నాం. బయటి ప్రాంతాలకు సమాచారం ఇవ్వడానికి సెల్‌ఫోన్ ఛార్జింగ్ సైతం చేసేందుకు అవకాశం లేదు." - రమాదేవి, గృహిణి ఎస్సీ కాలనీ, బూర్గంపాడు, భద్రాద్రి జిల్లా
అంతా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు. కూలిపనులు, కొద్దిపాటి వ్యవసాయంతో బతుకుతున్నారు. అంతంతమాత్రంగా సాగే వారి జీవితాలను గోదావరి వరద దెబ్బతీసింది. తిండిగింజలు.. ఇతర సరకులు.. విత్తనాలు, దుస్తులు అన్నిటినీ కబళించేసింది. దీంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి తీరం వెంట ఉన్న పలిమెల, పంకెన, లెంకలగడ్డ, నీలంపల్లి, సర్వాయిపేట, దమ్మూరు, ముకునూరు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఊళ్లొదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లారు. మరికొందరు అడవుల్లో డేరాలు వేసుకుని పిల్లాపాపలతో బిక్కుబిక్కుమంటూ గడిపారు.
వరద తగ్గడంతో వెనక్కి వస్తున్న వారు.. తమ ఇళ్లల్లో పరిస్థితిని చూసి గుండెలు బాదుకుంటున్నారు. మండలంలో సుమారు 40 ఇళ్ల గోడలు కూలిపోయాయి. రెండు వేల ఎకరాల పత్తి పంట నీట మునిగింది. ‘మా ఇంట్లో అయిదు క్వింటాళ్ల బియ్యం, పది క్వింటాళ్ల వడ్లు, పెసలు, దుస్తులు, సామగ్రి తడిసిపోయాయి. బోరు మోటారు వరదలో కొట్టుకుపోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పంకెన గ్రామానికి చెందిన జాడి లక్ష్మి. వరదపోటుతో మహదేవ్‌పూర్ మండలంలోని పెద్దంపేట వాగు వంతెన వద్ద అప్రోచ్ రహదారి ధ్వంసం కావడంతో పలిమెల మండలానికి రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర వైద్యం అవసరమైనవారు అవస్థలు పడ్డారు. ఇప్పుడిప్పుడే వరదలు తగ్గుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలకు అవకాశం కలిగింది.
తాగునీటికి ఇక్కట్లు పడుతున్నాం.. "పది రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. ఊళ్లోని ఒక చేతిపంపు నీరే దిక్కవుతోంది. అది కూడా సరిగా రావడంలేదు. ఎగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీతో మేం మూడేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ బతకలేకపోతున్నాం. మాకు న్యాయం చేయాలి."
- అఫ్జల్ బీ, లెంకలగడ్డ, పలిమెల మండలం
పంట పెట్టుబడులు నీటిపాలు.. "గోదావరి వరదలతో మా ఊళ్లో దాదాపు 200 ఎకరాల పత్తి పంట నీట మునిగింది. మొక్కలు చనిపోయాయి. దీంతో పంటలకు పెట్టిన పెట్టుబడులు వృథా అయ్యాయి. ఇప్పుడు వరద తగ్గినా.. మళ్లీ పంట వేసే పరిస్థితి లేదు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి." - కోయల్‌కార్ సతీశ్, లెంకలగడ్డ
ఇదీ చదవండి :