Medical Council: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. అత్యవసర సేవల సిబ్బంది వేతనాల చెల్లింపులకూ నిధుల కొరత వెంటాడుతోంది. ఆసుపత్రులతో పాటు వివిధ పథకాల కింద పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు జీతాలు రాక ఆందోళన చెందుతున్నారు. అసలే అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఇవ్వలేక పోతున్నారు.
ఏటా రూ.500 కోట్లు అవసరమైతే.. ఈసారి 350 కోట్లే కేటాయించారు: రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో పని చేసే 1,982 మంది ఒప్పంద ఉద్యోగులు, 2,526 మంది పొరుగుసేవల సిబ్బందికి ఫిబ్రవరి నుంచి వేతనాలు ఆగిపోయాయి. సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో స్టాఫ్‌నర్సు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్, రేడియోగ్రాఫర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, మరో 15 కేటగిరీల్లో వీరు పనిచేస్తున్నారు. వీవీపీ ఆధ్వర్యంలోని ఆసుపత్రులకు ఏటా రూ.500 కోట్లు అవసరమైతే.. ఈసారి 350 కోట్లే కేటాయించారు.
జీతాల చెల్లింపులకు కటకట ఏర్పడింది. ట్రామాకేర్ కేంద్రాల్లోని 450 మంది ఉద్యోగులకు 10 నెలలుగా జీతాల్లేవు. టెక్కలి, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ఏలూరులోని ట్రామాకేర్ కేంద్రాల్లో వైద్యులు, నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో, అంబులెన్సు డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణ ఉద్యోగికి లక్ష 20 వేలు, స్టాఫ్‌నర్సుకు 2 లక్షల 40 వేల చొప్పున రావాల్సి ఉందని ట్రామాకేర్ ఎంప్లాయీస్ వెల్లడించింది.
తిరుపతి, కుప్పం, పుంగనూరు, వి.కోట, బంగారుపాళ్యం, నగరి తదితర ఆసుపత్రుల్లోని సుమారు 350 మంది పారిశుద్ధ్య సిబ్బందికి 3 నుంచి 7 నెలలుగా జీతాలు అందలేదు. వీరిని నియమించుకున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు. ప్రతినెలా తొలి వారంలోనే జీతాలు అందుకునే జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు సెప్టెంబరు నెల వేతనాలు ఇప్పటికీ రాలేదు. 108 అంబులెన్సుల సర్వీసుల్లో సుమారు 6,500 మంది, 104 సంచార వైద్యశాలలో 2,500 మంది పనిచేస్తున్నారు. వీరికి కూడా ఆగస్టు నుంచి జీతాలు రాలేదు. 108, 104 నిర్వహణ సంస్థలకు ప్రతి మూణ్నెళ్లకోసారి రాష్ట్రం రూ.78 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఆ మొత్తం కూడా చెల్లించడం లేదు.
ఇవీ చదవండి: