ETV Bharat / city

మ'రుణ' మృదంగం - రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యల వార్తలు

ఏళ్లుగా పేరుకుపోతున్న అప్పులకు తోడు కరోనా తెచ్చిపెట్టిన కష్టంతో.. కళకళలాడుతున్న పంట కోయలేక.. కోసినా అమ్మలేక.. కళ్లముందే కుళ్లిపోతుంటే చూడలేక అన్నదాతల గుండెలు అలసిపోతున్నాయి. అప్పులపై చక్రవడ్డీలు.. ప్రామిసరీ నోట్లు తిరగరాయాలనే ఒత్తిడి..పిల్లల చదువులు, పెళ్లిళ్లు.. ఇలా అన్నీ రైతన్నకు ఉరితాళ్లవుతున్నాయి.

farmers deaths in ap state
పంటలు నష్టాలతో రైతన్నల ఆత్మహత్యలు
author img

By

Published : Jun 10, 2020, 7:07 AM IST

గత రెండున్నర నెలల్లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 20మంది రైతుల పరిస్థితిని పరిశీలించగా... వారు చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ.1.98 కోట్లని తేలింది. వడ్డీ వ్యాపారులు, బ్యాంకర్లకు ఇది చిన్న మొత్తమే. రైతుకు మాత్రం పెనుభారం. ఈ ఏడాదైనా బంగారం లాంటి పంట పండుతుందని, అప్పులన్నీ తీర్చేయొచ్చన్న ఆశతో.. పాత అప్పులకు వడ్డీలు కట్టి, కొత్త అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. కానీ విధి ఎదురుతిరగడంతో ఆత్మహత్యే దిక్కనుకున్నారు. రూ.లక్ష అప్పు తీసుకుంటే ఏడాది తిరిగేసరికి రూ.1.24 లక్షలు (రూ.వందకు నెలకు రూ.2 వడ్డీతో). ఏడాదికి నోటు తిరగరాస్తే రెండో ఏడాదికి రూ.1,53,760. మళ్లీ తిరగరాస్తే మూడో ఏడాదికి రూ.1,90,660 అవుతుంది. ఇలా రైతన్నలపై భారం పెరుగుతోంది.

ఆ 20 మందిలో.. సొంత భూమి లేని కౌలు రైతులు: 4
సొంత భూమినే సాగు చేసేవారు: 6
సొంత భూమితోపాటు కౌలుకు చేసేవారు: 10

చనిపోయిన 20 మందిలో 11 మంది రైతులు 5-20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశారు. ఒక ఏడాది పంట కలిసొస్తే అప్పులన్నీ తీరుతాయని తలకు మించిన భారమైనా భరిద్దామనుకున్నారు. చివరకు కౌలుకు సరిపడా ఆదాయమూ రాలేదు. గుంటూరు జిల్లాలో పసుపు వేసే పొలానికి ఎకరాకు కౌలు రూ.40-50 వేలు. మిరప వేసే పొలానికీ రూ.25 వేల పైమాటే. రాయలసీమలోనూ పత్తి, పప్పుధాన్యాలు వేసే పొలాలకు ఎకరాకు రూ.5-15 వేల వరకు చెల్లించాలి. ఇది అప్పుల భారాన్ని పెంచుతోంది.

అప్పులెందుకు పెరుగుతున్నాయంటే..

పరిశీలించిన 20 మంది రైతుల్లో.. మిర్చి సాగుచేసిన వారికే రూ.10-30 లక్షల వరకు అప్పులయ్యాయి. ఎక్కువ మందికి బోర్లు వేయడానికే భారీగా ఖర్చవుతోంది. ఒక్కో బోరుకు సగటున రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చుచేస్తున్నారు. ః మిరప, పసుపు పెట్టుబడి ఎకరాకు రూ.1.50 లక్షల వరకు అవుతోంది. ఆదాయం సగం కూడా దక్కట్లేదు.
* పప్పుధాన్యాల దిగుబడీ తక్కువ.. గిట్టుబాటు ధరా లేదు.
* కూరగాయలు, బత్తాయి, అరటి రైతులు లాక్‌డౌన్‌లో వాటిని అమ్ముకోలేకపోయారు.
* టమాటా, ఇతర కూరగాయల పంటల దిగుబడి వచ్చే సమయానికి ధర దిగజారింది.
* ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుల్లోని 20 కుటుంబాల ఆత్మఘోష

ఉపాధి సొమ్మూ తీసుకోనివ్వట్లేదని..

బ్యాంకులో రూ.50 వేల అప్పు తీర్చలేదని.. ఉపాధి హామీ కూలిపని డబ్బులు కూడా తీసుకోనివ్వకుండా ఖాతాను బ్లాక్‌ చేయడంతో అవమానం, ఆవేదన ఆ రైతు ప్రాణాలు బలిగొన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ఆసన్నగూడేనికి చెందిన యర్రా రాంబాబు (42) కౌలురైతు. రూ.2.50 లక్షల పెట్టుబడి అప్పుగా తెచ్చారు. కత్తెర పురుగు ప్రభావంతో మొక్కజొన్న ఎకరాకు పది బస్తాలే వచ్చింది. అరెకరం దొండ పండినా.. లాక్‌డౌన్‌తో కిలోకు రూ.2 కూడా దక్కలేదు. తీవ్ర మనోవేదనతో.. మే 31న ఆత్మహత్య చేసుకున్నారు.

వెంటాడిన సమస్యలు

బోర్ల ఖర్చు.. సరకు కొన్న వ్యాపారి ఉడాయించడం.. లాక్‌డౌన్‌తో పంట అమ్ముకోలేకపోవడం.. ఈ కష్టాలు పౌల్‌రెడ్డి(59)ని ఆత్మహత్యకు పురిగొల్పాయి. కడప జిల్లా పులివెందుల పురపాలిక పరిధిలోని చిన్నరంగాపురానికి చెందిన పౌల్‌రెడ్డి 9 ఎకరాల్లో బత్తాయి సాగు చేశారు. గతేడాది రూ.4.20 లక్షలతో ఆరుబోర్లు తవ్వించారు. 8 టన్నుల దిగుబడిని రూ.4.50 లక్షలకు అమ్మితే.. వ్యాపారి డబ్బులివ్వకుండా ఉడాయించాడు. గాలివానకు ఈ ఏడాది ఆరు టన్నుల పంట నేలరాలింది. మిగిలిన రెండు టన్నులు అమ్ముదామన్నా లాక్‌డౌన్‌లో వ్యాపారులు రాలేదు. ఏప్రిల్‌ 19న పురుగుమందు తాగి మరణించారు.

ఆ ఇంట్లో మూడో చావు

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడకల రైతు రఘురామిరెడ్డి(61).. తన సొంతానికి 10, కౌలుకు మరో 10 ఎకరాల్లో పత్తి, పొగాకు వేస్తే.. వర్షంతో అంతా కుదేలైంది. అప్పులు రూ.25 లక్షలకు చేరడంతో చివరకు.. తోటలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో ఆయన భార్య, చిన్న కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

పంటల్లో నష్టం.. తండ్రి అనారోగ్యం

కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం హెచ్‌.కొట్టాలకు చెందిన చల్లా శ్రీనివాసులు (29).. పదెకరాల సొంత పొలంతో పాటు పదెకరాలు కౌలుకు తీసుకున్నారు. మామిడి, వేరుసెనగ, కొర్ర, సజ్జ, కంది.. అన్నీ నష్టాలే మిగిల్చాయి. తండ్రి చికిత్సకు రూ.1.50 లక్షల ఖర్చయింది. అప్పులు రూ.4 లక్షలకు పైగా చేరాయి. దీంతో ఉరి వేసుకుని మరణించారు.

పంట చేతికొచ్చినా..

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముదరంపల్లె రైతు చిన్నరెడ్డెప్పరెడ్డి (31)కి లాక్‌డౌన్‌ సమయంలో టమాటా పంట చేతికొచ్చింది. ధరల్లేక, మార్కెట్‌కు తీసుకెళ్లే దారి కనిపించక రూ.5 లక్షల అప్పు మిగిలింది. తీర్చే దారిలేక ఉరేసుకుని చనిపోయారు. దిగుబడి బాగా వచ్చిందని, టమాటా అమ్ముకోగలిగితే అప్పు తీరిపోయి.. ప్రాణాలు నిలబడేవని అంటున్నారు.

దెబ్బతీసిన లాక్‌డౌన్‌

చిత్తూరు జిల్లా భైరామంగళం రైతు నాగరాజు (56) అయిదెకరాల్లో టమాటా వేశారు. మూడెకరాల్లో పంట చేతికొచ్చేసరికి లాక్‌డౌన్‌ మొదలయింది. కోతకూ అవకాశం లేకపోయింది. పొలంలో బోర్లకు రూ.4 లక్షలు ఖర్చయింది. అప్పులన్నీ కలిపి రూ.12 లక్షలకు చేరాయి. ఒత్తిడికి లోనై మే 19న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

మునిగి.. ముంచిన పసుపు

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తలూరివారిపాలెం రైతు డిడ్ల నీలాంబరం(47).. తనకున్న 40 సెంట్లతోపాటు అయిదెకరాలు కౌలుకు తీసుకున్నారు. గతేడాది పసుపు వేస్తే వర్షాలకు మునిగినా.. ఎకరాకు రూ.40వేల కౌలు చెల్లించక తప్పలేదు. ఈ ఏడాది వరి, మొక్కజొన్న నష్టాలే మిగిల్చి.. అప్పును రూ.5 లక్షలకు చేర్చాయి. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.

‘బోరు’మంటూ ప్రాణాలొదిలారు..

కడప జిల్లా లింగాల మండలం కర్ణపాపాయపల్లెకు చెందిన యర్రమేకల రాఘవేంద్ర(35).. నాలుగెకరాల్లో అరటి వేశారు. రూ.4లక్షలతో మూడు బోర్లు వేశారు. అయినా నీరందక అరటి ఎండిపోయింది. నాలుగెకరాల్లో ధనియాలు వేస్తే నాలుగు బస్తాలే వచ్చాయి. పాత అప్పులు వడ్డీలతో కలిసి రూ.7 లక్షలు కావడంతో మే 7న పురుగుమందు తాగి చనిపోయారు.

కంది, జొన్నతో అప్పులపాలై..

కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం అప్పలాపురం రైతు పాలాజీ సత్యరాజు (57) ఈ ఏడాది 8 ఎకరాలు కౌలుకు తీసుకుని జొన్న, కంది వేశారు. గతంలోలాగే ఈసారీ దిగుబడులు రాలేదు. మొత్తం అప్పు రూ.4లక్షలకు చేరింది. ఎలా తీర్చాలో తెలియక.. విషపు గుళికలు మింగి పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కౌలుతో కష్టం చేసినా..

శిరువెళ్ల మండలం వనికెన్‌దిన్నె రైతు బండి సురేంద్ర (29)కు సొంత పొలం లేక ఏడెకరాలు కౌలుకు తీసుకున్నారు. వరి, పత్తి, మిరప కలిపి ఏడెకరాల్లో సాగుచేస్తే రూ.3 లక్షల అప్పు మిగిలింది. పాతది కలిపి రూ.5 లక్షలకు చేరింది. మనోవేదనతో సురేంద్ర ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య నాగలక్ష్మి కూలి చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు.

పంట దిగుబడి తగ్గి..

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం కలచాట్లకు చెందిన కుంటి వెంకటేశ్‌ (60).. సొంత పొలం 5, కౌలు 5 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఆముదం, టమాటా, బొప్పాయి వేసినా నీరు లేక దిగుబడి సరిగా రాలేదు. అయిదేళ్ల నుంచి తెచ్చిన అప్పులు రూ.7 లక్షలయ్యాయి. దిగుబడి రాక.. తీర్చే దారిలేక చెట్టుకు ఉరి వేసుకుని 6న ఆత్మహత్యకు పాల్పడ్డారు.

13 ఎకరాల కౌలు..

బనగానపల్లి మండలం మంగళవారంపేటకు చెందిన శ్రీరాముల చిన్నపెద్దయ్య (32) 13 ఎకరాలు కౌలుకు తీసుకుని జొన్న, వరి, మిరప సాగు చేశారు. ఈ ఏడాది దిగుబడి సరిగా లేదు. లాక్‌డౌన్‌తో పంటలూ అమ్ముకోలేకపోయారు. పాత అప్పులు కలిసి రూ.9లక్షలకు చేరింది. తీర్చేదారి లేక.. మే 2న పురుగుమందు తాగి ప్రాణాలు వదిలారు.

వరి ఎకరాకి 20 బస్తాలే

కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పెద్దదేవాళాపురం రైతు కె.చంద్రాచారి(38).. సొంతం 3, కౌలుకు 5 ఎకరాల్లో వరి సాగుచేయగా అకాల వర్షాలతో ఎకరాకు 20 బస్తాలే వచ్చింది. లాక్‌డౌన్‌ వల్ల పంటను తక్కువ ధరకే విక్రయించారు. పాతవి, కొత్తవి కలిపి అప్పులు రూ.10 లక్షలకు చేరడంతో.. పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

బోరు వేసినా నీరు పడక..

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన ఈదుర్‌బాషా(36).. ఒకటిన్నర ఎకరాల్లో పత్తి సాగుచేశారు. కొత్త బోరు వేసినా నీరు పడక.. పత్తి దిగుబడి నాలుగున్నర క్వింటాళ్లే వచ్చింది. అప్పులన్నీ కలిపి రూ.4.5 లక్షలకు చేరాయి. రుణం పెరుగుతుండటంతో ఈదుర్‌బాషా మే 2న ఉరివేసుకుని చనిపోయారు. కుటుంబ భారం అతడి భార్య సైదాబీపై పడింది.

రూ.30 లక్షల అప్పులు

కర్నూలు జిల్లా ఇల్లూరు కొత్తపేటకు చెందిన బీరం వెంకటరెడ్డి (48) మూడెకరాల సొంత పొలంతోపాటు 20 ఎకరాలు కౌలుకు చేస్తున్నారు. అయిదేళ్లుగా పంటలు సరిగా లేక రూ.30 లక్షల మేర అప్పులయ్యాయి. అవి తీర్చే దారి కానరాక.. మే 24న విషపు గుళికలు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

టమాటా కోయలేక.. పెట్టుబడి రాక

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం దిగువపల్లెకు చెందిన బాలే తిమ్మయ్య (68).. రెండెకరాల్లో టమాటా వేశారు. పంట చేతికొచ్చిన సమయంలో లాక్‌డౌన్‌ రావడంతో.. అమ్ముకోలేక కాయల్ని వదిలేశారు. రూ. 3 లక్షల అప్పునకు తోడు.. పంట మొత్తం పోవడంతో తీర్చే దారి కనిపించక.. జూన్‌ 2న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

నిమ్మ కోయలేక..

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం రైతు పులపుత్తూరు పెంచలస్వామి(48) సొంతభూమి 3.5, 4.5 ఎకరాల కౌలుభూమిలో నిమ్మ, వరి సాగుచేశారు. అరకొరగా పండిన నిమ్మను లాక్‌డౌన్‌ వల్ల కోయలేక.. తీవ్రంగా నష్టపోయారు. అప్పులన్నీ కలిసి రూ.10 లక్షలయ్యాయి. కొంత పొలం అమ్మినా తీరకపోవడంతో.. మే 21న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

పత్తికి గులాబీ పురుగు..

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు రైతు పాటిబండ్ల ఆంజనేయులు (54).. నాలుగెకరాల్లో పత్తి వేస్తే గులాబీ పురుగు ధాటికి దిగుబడి తగ్గింది. మిరపకు వైరస్‌తో దిగుబడి పడిపోయింది. కోతకు కూలీలూ దొరకలేదు. సాగు కలిసి రాకపోవడం, గుండెనొప్పి వైద్యానికి చేసిన అప్పులు కలిసి రూ.18 లక్షలకు చేరడంతో జూన్‌ 4న ఉరివేసుకుని మరణించారు.

మిర్చి రైతుకు రుణభారం

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం చింతలపల్లె రైతు తెలుగు రాముడు (50).. సొంత భూమి 5, కౌలుభూమి మరో 7 ఎకరాల్లో మిరప సాగుచేశారు. రూ.4 లక్షల పెట్టుబడికి నష్టాలే మిగిలాయి. అప్పులన్నీ కలిపి రూ.18 లక్షలు కావడంతో.. తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. నోట్లు తిరిగిరాస్తే అప్పు రూ.25 లక్షలు అవుతుందని ఆయన కుమారుడు వాపోతున్నారు.

నాలుగు బోర్లు వేయించి..

కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ఆర్‌.బుక్కాపురానికి చెందిన ఎర్రమల సత్యం (52) సొంతపొలం 9, కౌలుభూమి 11 ఎకరాల్లో కంది, పత్తి, వేరుసెనగ, సజ్జ, ఆముదం, జొన్న సాగుచేశారు. అధిక వర్షాలతో పంట దెబ్బతింది. నాలుగు బోర్లకు రూ.5.50 లక్షలు ఖర్చయింది. అప్పులు రూ.11.40 లక్షలు కావడంతో ఆత్మహత్య చేసుకున్నారు.

మేమున్నామనే భరోసా కావాలి
-కిరణ్‌కుమార్‌ విస్సా, రైతు స్వరాజ్య వేదిక

నిస్సహాయ స్థితిలోనే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో మేమున్నామనే భరోసా వారికి కల్పించాలి. అన్నదాతలు కష్టపడుతున్నా సమస్యలు ఉన్నాయంటే బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలే. రైతుల సమస్యలు వివిధ శాఖలతో ముడిపడి ఉంటాయి. వాటన్నింటి పరిష్కారానికి ఏకీకృత కేంద్రం ఏర్పాటుచేయాలి. కౌలు రైతులకు రైతుభరోసా అమలు చేయడంతోపాటు పంటరుణాలు వచ్చేలా చూడాలి. ఇలాంటి చర్యల ద్వారా కొంతమందైనా ఆత్మహత్య చేసుకోకుండా ఆపే అవకాశం ఉంది.

మరణించిన రైతుల సగటు వయసు 46.5 ఏళ్లే. 30 ఏళ్లలోపు ఇద్దరు, 40 ఏళ్లలోపు వారు అయిదుగురు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.