ఆలయ మర్యాదలు కోరుతూ రాసిన లేఖను విశాఖ శారదా పీఠం ఉపసంహరించుకుంది. ఈ విషయాలన్ని హైకోర్టుకు తెలిపింది. విశాఖ శారదా పీఠం లేఖపై దేవదాయ శాఖ జారీచేసిన మెమోను సవాల్ చేస్తూ లలిత్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు శారదాపీఠం కోర్టుకు తెలిపింది.
నవంబర్ 18న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు జరపాలంటూ రాష్ట్ర దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని స్పష్టం చేసింది. అరసవెల్లి సూర్య దేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్ధం, సింహాచలం, కనకమహాలక్ష్మి ఆలయం, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానాల ఈవోలకు దేవదాయశాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ మెమోలు జారీ చేశారు. ఈ నెల 9న విశాఖ శారదా పీఠం మేనేజర్ రాసిన లేఖకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో లలిత్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకు ముందు ఉన్న ఆచారాలకు భిన్నంగా ప్రత్యేక పూజలు చేయాలంటూ ప్రధాన దేవాలయాలకు దేవాదాయ శాఖ మెమో ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విషయం వివాదాస్పదం కావడంతో శారదాపీఠం తమ లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: స్వరూపానంద జన్మదిన వేడుకలు జరపాలని దేవదాయశాఖ ఆదేశాలు