రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఆదివారం విద్యుత్ డిమాండ్ సుమారు 194 మిలియన్ యూనిట్లు(ఎంయూ)గా ఉంది. గరిష్ఠ డిమాండ్ సమయంలో మాత్రం 2-3 ఎంయూల విద్యుత్‌ను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దీనికోసం పరిశ్రమలు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అందించే సరఫరాను కొంత తగ్గించి సర్దుబాటు చేశారు. గత మూడు రోజులతో పోలిస్తే విద్యుత్ సరఫరా కొంత మెరుగైనప్పటికీ పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. ఏపీ జెన్‌కో యూనిట్ల నుంచి 3,306.2 మెగావాట్ల విద్యుత్ వస్తోంది. ఎన్టీపీసీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించింది. ఇంకా అవసరమైన విద్యుత్‌ను ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేయటానికి వీలు ఏర్పడింది. హిందుజా నుంచి 1040 మెగావాట్లు, సెంబ్‌కార్ప్ నుంచి 500 మెగావాట్లను తీసుకోవటానికి వీలుగా డిస్కంలు చేసుకున్న పీపీఏల వల్ల గత మూడు రోజులుగా విద్యుత్ కొరత ఉన్నా పరిస్థితి కొంత అదుపులో ఉంది. ఈ విద్యుత్ కూడా లేకుంటే సమస్య మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు చెబుతున్నారు.
డిమాండ్‌లో స్వల్ప లోటు
- రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 193.93 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఇందులో థర్మల్ విద్యుత్ 78.9 ఎంయూలు, జల విద్యుత్ 7.14, గ్యాస్ 3.89, పవన విద్యుత్ 4.73, సౌర విద్యుత్ 15.49, ఇతర ఉత్పత్తి సంస్థల నుంచి 1.68 ఎంయూల విద్యుత్ గ్రిడ్‌కు అందింది. దీంతో పాటు విద్యుత్ ఎక్స్ఛేంజీలు, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి (ఎన్‌టీపీసీ) షెడ్యూల్ చేసిన విద్యుత్ 78.19 ఎంయూలు ఉంది. జాతీయ గ్రిడ్ నుంచి అన్ షెడ్యూల్డ్ ఇంటర్ చేంజ్ కింద 3.92 ఎంయూలను అదనంగా తీసుకున్నారు. దీంతో గరిష్ఠ డిమాండ్ సమయంలో సుమారు 2-3 ఎంయూలను సర్దుబాటు చేయాల్సి వచ్చింది.
- లోడ్ సర్దుబాటు కోసం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచి సుమారు 325 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. అత్యవసర సమయంలో వినియోగించుకోవడానికి వీలుగా రెండు మూడు రోజులకు సరిపడా నీటి నిల్వలను ఉంచారు. ప్రస్తుతం విద్యుత్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో గత మూడు రోజులుగా వాటిని వినియోగించారు. దీంతో మళ్లీ వర్షాలు కురిసి రిజర్వాయర్‌లోకి నీరు వస్తేనే శ్రీశైలం నుంచి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శనివారం ఉదయం గ్రిడ్ గరిష్ఠ డిమాండ్
శనివారం ఉదయం 9.51 గంటల సమయంలో గ్రిడ్ డిమాండ్ గరిష్ఠంగా 12,423.09 మెగావాట్లకు చేరింది. ఈ సమయంలో 10,896 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉంది. సుమారు 1,527.09 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు ఇది సంకేతమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే 195 ఎంయూల మధ్య డిమాండ్ ఉంటోందని.. మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ సుమారు 240 ఎంయూలకు చేరే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి..power problems in ap: బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ