Pranahita Pushkaralu: గోదావరి ఉపనది అయిన ప్రాణహిత నది పుష్కరఘాట్లలో భక్తుల సందడి నెలకొంది. తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం, మహారాష్ట్రలోని సిరోంచ, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి పుష్కర ఘాట్లు కోలాహలంగా మారుతున్నాయి. మండుటెండనూ లెక్క చేయకుండా వస్తున్న భక్తులు గంగమ్మకు సారె పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకుంటున్నారు.
వేసవి వేళ పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులు ఎండలతో అవస్థలు పడుతున్నారు. తీరం వద్దకు నడుచుకుంటూ రావడానికి వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రోజు సుమారు లక్షన్నర మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. పెద్ద ఎత్తున కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దర్శనానికి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గురువారం ఒక్కరోజే దాదాపు రూ.6.5 లక్షల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: POLAVARAM: రెండు దశల్లో పోలవరం పునరావాసాలు... కేంద్ర జల్‌శక్తిశాఖ వెల్లడి