ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి రైతుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. లాభాల కోసం పత్తి సాగు చేసిన అన్నదాతలకు... చివరకు నష్టాలే మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో 2 లక్షల 68 వేల582 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 2 లక్షల 7 వేల 992 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చే దశలో ఉన్న పత్తికి పురుగు ఆశించడం వల్ల అపార నష్టం వాటిల్లింది. పత్తి కాయలన్నీ రంగుమారి... ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
పురుగు రూపంలో మరోకష్టం
అసలే దిగుబడులు తగ్గి తీరని కష్టాల్లో ఉన్న అన్నదాతలకు గులాబీ పురుగు రూపంలో మరో కష్టం వచ్చిపడింది. పత్తి పంటపై పిడుగులా పడిన గులాబీ పురుగు... రైతుల ఆశల్ని అడియాశలు చేసింది. దీనికారణంగా పత్తిరంగు మారడమే కాకుండా నాణ్యత పూర్తిగా దెబ్బతిని బరువు గణనీయంగా తగ్గుతుంది. పురుగు ఆశించిన కాయలు త్వరగా పక్వానికి వస్తాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చేసేదేమీ లేక పత్తి పంటను తొలగిస్తున్నామని రైతులు చెబుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో రైతన్న
అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు సోకి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పత్తి రైతులకు మద్దతు ధర మరింత కంగారు పెడుతోంది. ఆరుగాలం కష్టపడి పంట పండించి మార్కెట్‌కు తీసుకొస్తే … ప్రభుత్వం ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఇవీ చూడండి: