రాష్ట్రంలో కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 164కు చేరింది. వీరిలో 108 మంది దిల్లీలోని మతపరమైన కార్యక్రమానికి వెళ్లివచ్చిన వారే. మరో 32 మంది వారికి సన్నిహితంగా మెలిగిన వారికి వ్యాధి సోకింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదు కాగా...శుక్రవారం 8మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు.
దిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్ సదస్సుకు వెయ్యి 85 మంది హాజరుకాగా...946 మందే తిరిగి వెనక్కి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన 139 మందిలో కొందరు దిల్లీలోనే ఉండిపోగా...ఇంకొందరు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లినట్లు తేల్చారు. వీరెవ్వరూ ఫోన్‌లు తీయకపోవడంతో వారి వివరాలను ఆయా రాష్ట్రాలకు అందజేశారు.
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 550 క్వారంటైన్ కేంద్రాల్లో 50 వేలకు పైగా పడకలను సిద్ధం చేశారు. వీటిల్లో 4వేల 651 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1115 మంది క్వారంటైన్‌లో ఉండగా....చిత్తూరులో 576, కర్నూలులో 574, కృష్ణా జిల్లాలో 368, గుంటూరు జిల్లాలో 312 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనాకు చికిత్స అందిస్తున్న వారికి కల్పిస్తున రక్షణ చర్యలు అంతంత మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4,319 మాత్రమే వ్యక్తిగత రక్షణ సామాగ్రి ఉండగా....ప్రస్తుత అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవని వైద్యులు తెలిపారు.
జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు
- నెల్లూరు-32
- కృష్ణా-23
- గుంటూరు-20
- కడప-19
- ప్రకాశం-17
- ప.గోదావరి-15
- విశాఖపట్నం-15
- తూ.గోదావరి-11
- చిత్తూరు-9
- అనంతపురం-2
- కర్నూలు-1
ఇదీ చదవండి :