MOTHER DEATH: ఆ చిన్నారులకేమి తెలుసు అమ్మలేదని.. ఇక తిరిగి రాదని..అందుకే ఎప్పటిలాగే తల్లి పక్కనే ఆడుకుంటున్నారు..మమతానురాగాల మాతృ ప్రేమకై ఇలా తల్లడిల్లుతున్నారు..చుట్టూ గుమిగూడిన జనాలు వారు రోదిస్తుంటే దీనంగా చూస్తున్నారు..ఆప్యాయంగా బోసినవ్వుల పాప అమ్మ మోమును చూస్తుంటే..ఏడాదిన్నర వయసున్న కొడుకు అమ్మ నుదురుని ముద్దాడుతుంటే..ఊహ తెలియని చిన్నారి ‘అమ్మా లెమ్మని’ సైగలతో చేయిపట్టుకుంటుంటే..పాలు కావాలనేలా.. ప్రేమ పంచాలనేలా అమ్మా.. రమ్మని బాబు పిలుస్తుంటే...చుట్టూ ఉన్న వారి గుండెలు కరిగిపోయాయి. ఆగని వేదనతో చూపరులకు కన్నీళ్లు రాలాయి.ఈ మరణాన్ని చూసి అందరి కళ్లు చెమర్చాయి. విధి ఆడిన నాటకమీ.. ఘోరమనే వేదనను మిగిల్చాయి. ఈ హృదయ విధారకమైన సంఘటన తెలంగాణలోని కరీంనగర్ నగరపాలక సంస్థ అలుగునూర్‌లో చోటుచేసుకుంది.
నగరంలోని సిల్ల అనిల్‌కుమార్, అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొంతకాలంగా సిల్ల అనూష(26) కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో బుధవారం మృతి చెందింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలకు ఏమి జరిగిందో కూడా తెలియని పరిస్థితి.. ఏడాదిన్నర వయస్సు ఉన్న బాబు(రిషికేష్)తోపాటు 8నెలల చిన్నారి(చిక్కీ) తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న తీరు బంధువులను, అయినవారిని కన్నీటి సంద్రంలో ముంచింది.
అనూష కిడ్నీలో రాళ్లున్నాయని గత కొన్నాళ్లుగా బాధ పడుతున్నాదని కుటుంబీకులు తెలిపారు. ఆమె భర్త అనిల్‌కుమార్‌తో కలిసి నగరంలోని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగిందన్నారు. రెండు కిడ్నీలలో రాళ్లున్నాయని తెలియడంతో వైద్యుల సూచనతో మందులు వాడుతున్నారన్నారు.
ఇంతలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స కోసం దాదాపుగా రూ.లక్షకుపైగా వెచ్చించినా తన భార్య బతకలేదనే వేదనను భర్త విలపించారు. తల్లి మృతితో రెండేళ్లలోపున్న చిన్నారుల వేదన కలచివేస్తోంది.
ఇవీ చదవండి: