రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండరు దక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌కు ఆ బాధ్యతలను అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న ఇసుక రేవులు, నిల్వ కేంద్రాలు, డిపోలను.. జేపీ సంస్థ ప్రతినిధులు, గనులశాఖ అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. వివిధ జిల్లాల్లోని ఇసుక డిపోలను సంస్థ ప్రతినిధులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. డిపోల్లో ఇసుక నిల్వలుంటే వాటిని లెక్కిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే డిపోల్లో ఉన్న ఇసుక నిల్వలకు కొలతలు వేసి, ఆ వివరాలు పంపాలని గనులశాఖకు ఆదేశాలు అందాయి.
ఏపీఎండీసీ ద్వారా ప్రస్తుతం నిత్యం సగటున లక్ష టన్నుల మేర ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్, సరఫరా జరుగుతోంది. ప్రైవేటు సంస్థ కార్యకలాపాలు ఎప్పట్నుంచి మొదలవుతాయో.. ఆన్‌లైన్ బుకింగ్ ఏరోజు నుంచి నిలిపివేస్తారో స్పష్టత లేదు. విశాఖ నగర పరిధిలో 8 ఇసుక డిపోలు ఉండగా, వాటిలో దాదాపు 2.90 లక్షల టన్నుల ఇసుక నిల్వలున్నాయి. జేపీ సంస్థ ప్రతినిధులు ఆదివారం డిపోలకు వెళ్లి, ఇసుక నిల్వలకు కొలతలు వేశారు. దీనిపై అక్కడి అధికారులు అభ్యంతరం తెలిపారు. ఇలా కొలతలు వేసిన తర్వాత, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి ఇసుక సరఫరా చేయడం కుదరన్నారు. ఆన్‌లైన్ బుకింగ్ నిలిపివేసే వరకూ నగర పరిధిలోని డిపోలు అప్పగించబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రైవేటు సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలపై విధివిధానాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: కుప్పం రెస్కో: 'ఇప్పుడేంటి పరిస్థితి.. ఎవరి మాట నమ్మాలి..?'