రాజధాని ప్రాంతంలో రైతులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసి జైలుకు పంపడం అక్రమ నిర్బంధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సెక్షన్ 41ఎ ప్రకారం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి, జైలులో ఉంచడం అక్రమ నిర్బంధమేనని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని పేర్కొంది. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడం చెల్లదని, దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. రైతులు కె.అమర్‌బాబు, ఎన్.రామారావు, ఇ.రవికాంత్, ఇ.సందీప్ మరియదాసు, ఇ.కిశోర్, ఎస్.నరేశ్, డి.బాజీలకు కింది కోర్టు బెయిలు నిరాకరించగా వారు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ కేసులో పిటిషనర్లకు బెయిలు మంజూరు చేస్తూ ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని కిందికోర్టుతో పాటు పోలీసులను గతంలో ఆదేశించింది. ఆ మేరకు పోలీసులు, కింది కోర్టులు నివేదికలు సమర్పించాయి. ఈ బెయిలు పిటిషన్లపై జస్టిస్ కె.లలిత శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ సంఘటనను వక్రీకరించి పోలీసులు చెబుతున్నారన్నారు. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లకు బెయిలు మంజూరు చేయడంతో ఈ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లేనని చెప్పారు. తిరిగి ఆదేశాలు అక్కర్లేదని చెప్పగా.. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బెయిలు మంజూరు చేసినా అక్రమ నిర్బంధంపై విచారణ కొనసాగించవచ్చని తెలిపారు. న్యాయవాది స్పందిస్తూ ఇది చాలా చిన్నవిషయమని, కోర్టు ధిక్కరణగా పరిగణించాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాలన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి మీకు చిన్న విషయంగా కనిపించవచ్చు గానీ, ఇది రైతుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని, తగిన కారణాలు లేకుండా 18రోజులపాటు అక్రమంగా నిర్బంధించారన్నారు. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగానే తగిన అవకాశం ఇచ్చి ఉత్తర్వులు జారీచేస్తామంటూ విచారణను వాయిదా వేశారు.
ఇదీ చదవండి