విజయనగరం జిల్లా గుంపం గ్రామంలోని ఆలయ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఆలయభూముల్లో పట్టాలెలా ఇస్తారని ప్రశ్నించింది. సులువుగా తీసుకోవచ్చన్న ఉద్దేశంతో అందరూ దేవాలయాల భూముల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గుంపంలోని దేవాలయ భూముల్లో ఇళ్ల పట్టాల యత్నాన్ని సవాల్ చేస్తూ శ్రీదుర్గా భవాని సేవా సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. మొదట మరో ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించారని.. కొందరి ఒత్తిడి వల్ల దేవుడి మాన్యంలో పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. ఈ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుందని వ్యాఖ్యానించింది. ఇలాంటివే చాలా కేసులు తమ ముందుకు వస్తున్నాయని ఇక్కడేం జరుగుతోందని వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: