AP high court on Anandayya case: ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కదలికల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. కొవిడ్‌కు అందించే ఆయుర్వేద ఔషధాన్ని తీసుకునేందుకు తన ఇంటికి వస్తున్న ప్రజలను.. పోలీసులు అడ్డుకోకుండా విలువరించాలని కోరుతూ కృష్ణపట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు.
ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆయుర్వేద మందు ఇచ్చేందుకు అర్హతతో పాటు సంబంధిత యంత్రాంగం వద్ద పేరు నమోదు చేసుకోవాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. అర్హత లేకుండా, పేరు నమోదు చేసుకోకుండా ఆయుర్వేద మందు ఇచ్చేందుకు అనుమతించడానికి వీల్లేదన్నారు. ఆనందయ్య తరపు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ .. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టంలోని సెక్షన్ 33 ఈఈసీ ప్రకారం ఎలాంటి లైసెన్స్ , రిజిస్ట్రేషన్ లేకపోయినా తన పేషెంట్లకు ఆయుర్వేద ఔషధం ఇచ్చే అధికారం ఉందన్నారు. ఆనందయ్య ఇంటి వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేశారన్నారు. ఆయన కదలికలను అడ్డుకుంటున్నారని ధర్మానసం దృష్టికి తీసుకువచ్చారు. పోలీసుల చర్య వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమేనన్నారు . పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ .. కదలికలను అదుపు చేస్తున్నామన్న వాదన వాస్తవం కాదన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం .. చట్టప్రకారం తప్ప మరే రకంగా ఆనందయ్య కదలికల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇదీ చదవండి: 'ఆనందయ్యకు ఆయుష్ శాఖ నోటీసులు'