పంపుడ్ హైడ్రోపవర్ స్టోరేజీ ప్రాజెక్టులు... విద్యుత్ ను దాచుకుని భవిష్యత్తులో వినియోగించుకునేందుకు వీలుగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు. డ్యామ్ లు, రిజర్వాయర్ల వద్ద ఉండే సాధారణ హైడ్రో పవర్ ప్రాజెక్టుల తరహాలోనే టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా వీటిని రూపకల్పన చేసింది పునరుద్పాదక ఇంధన వనరులశాఖ. సౌర, పవన విద్యుత్ తరహాలోనే జలాన్ని కూడా విద్యుత్ పునరుత్పాదనకు వినియోగించుకునేలా డిజైన్ చేయటమే ఈ పంపుడ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుల కొత్తదనం. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వద్ద కాకుండా ఏపీలో 29 చోట్ల ఈ తరహాలో ఏర్పాటు చేయాలని పునరుద్పాదక ఇంధన వనరుల శాఖ భావిస్తోంది. తద్వారా 30 వేల 140 మెగావాట్ల విద్యుత్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉత్పత్తి చేసుకునందుకు వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
7చోట్ల నిర్మించేందుకు నిర్ణయం...
ప్రస్తుతం రాష్ట్రంలో 7 చోట్ల ఈ తరహా ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప జిల్లా గండికోట రిజర్వాయర్ వద్ద 600 మెగావాట్లు, అనంతపురం జిల్లా చిత్రావతి వద్ద 500 మెగావాట్లు, నెల్లూరు సోమశిల వద్ద 1200 మెగావాట్లు, కర్నూలు జిల్లా అవుకు వద్ద 800 మెగావాట్లు, విజయనగరం జిల్లా కురుకుట్టి, కర్రివలసవద్ద 1000,1200 మెగావాట్లు, విశాఖ జిల్లా ఎర్రవరం వద్ద 1000 మెగావాట్ల చొప్పున పంపుడ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. 30 నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన.
తొలిదశలో మొత్తం 6300 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న పీఎస్పీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వాస్తవానికి ఇందులో నాలుగు ప్రాజెక్టులు నదీ పరివాహక ప్రాంతాల్లోనూ మరో మూడు ప్రాజెక్టులు వాగుల వద్ద నిర్మించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక దేశవ్యాప్తంగానూ వివిధ రాష్ట్రాలూ ఈ తరహా ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. సౌర, పవన విద్యుత్ లో కేవలం 23 శాతం మాత్రమే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నమోదు అవుతుంది. ఈ హైడ్రో ప్రాజెక్టుల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడే ఉత్పత్తి చేసుకునే అవకాశముండటంతో ఈ ప్రాజెక్టులను పునరుద్పాదక ఇంధన వనరులశాఖ.... సహజ బ్యాటరీలుగా అభివర్ణిస్తోంది.
ఇదీ చదవండి