ap employees union leaders meets Ajay Jain: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలతో.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాసరావు, ఆస్కార్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రొహిబిషన్ డిక్షరేషన్ పై గందరగోళం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
రిపోర్టింగ్ తేదీ నుంచి ప్రొహిబిషన్ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరామన్నారు. అపాయింట్ మెంట్ అథారిటీగా ఉన్న కలెక్టర్ల ద్వారానే ప్రొహిబిషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకి కూడా వర్తిస్తాయని తెలిపారు. ఎఎన్ఎం, సెరికల్చర్, మహిళా పోలీసులకు సర్వీస్ రూల్స్ ఇంకా అమలు కావడం లేదని.. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కరోనాతో చనిపోయిన 200 మంది కుటుంబాలకు కారుణ్య నియామకాలివ్వాలని కోరామని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జిల్లా స్థాయిలో.. అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలని కోరామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. శానిటరీ ఉద్యోగులకు జాబ్ ఛార్ట్ ని అమలు చేయడంతోపాటు పంచాయతీరాజ్ ఉద్యోగులకు 144 జీవో అమలు చేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని కూడా కోరామని చెప్పారు.
11వ పీఆర్సీ అమలు చేయాలి - బండి శ్రీనివాసరావు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలపై 20 డిమాండ్లను అజయ్ జైన్ దృష్టికి తీసుకెళ్లామని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రొహిబిషన్ డిక్లేర్ చేయడానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 10వ పీఆర్సీతోపాటు 11వ పీఆర్సీని కూడా అమలు చేయాలని కోరామన్నారు. 40 సంవత్సరాలు దాటిన వారికి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరే ఉద్యోగోన్నతి కల్పించడం సహా కారుణ్య నియామకాలు, బదిలీలు గురించి చర్చించామన్నారు.
ప్రత్యేక జాబ్ చార్ట్ ఉండాలి - ఆస్కార్ రావు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి 33 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అస్కార్ రావు తెలిపారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వెంటనే ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని కోరామన్నారు. వైద్యశాఖలో పనిచేస్తున్న 300 మంది ఏఎన్ఎంలు కంటి వెలుగులో పనిచేసిన కాలాన్ని ప్రొహిబిషన్ లోనే పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక శాఖపై మరోశాఖ ఆధిపత్యం లేకుండా 19 శాఖల ఉద్యోగులకు ప్రత్యేక జాబ్ చార్ట్ ఉండాలని కోరామన్నారు.
ఇదీ చదవండి:
High Court Fire On State Govt: వెబ్‌సైట్‌లో జీవోల కేసు.. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం