రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్న తీరుపై సీఎం జగన్.. క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య, పోలీసు అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ ఇంటికే పరిమితమవ్వాలని.. అప్పుడే వైరస్ తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
కరోనా పరిస్థితిపై అధికారుల వివరణ
రాష్ట్రంలో కరోనా పరిస్థితి, పాజిటివ్ కేసుల సంఖ్యపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కరోనా సోకిన 80.9 శాతం మంది ఐసోలేషన్లోనే ఉంటూ.. కోలుకుంటున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 13.8 శాతం మంది ఆస్పత్రిలో చేరుతున్నారని వారిలో 4.7 శాతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో... అత్యున్నత వైద్య సదుపాయలతో 1300 పడకలు అందుబాటులోకి వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. 150 వెంటిలేటర్స్‌తో వెంటనే ఐసీయూ యూనిట్లు ఏర్పాట్లు చేస్తున్నామని.. త్వరలో మరో 200 వెంటిలేటర్స్‌తో ఐసీయూ యూనిట్లు అందుబాటులోకి వస్తాయని.... పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 450 వెంటిలేటర్స్ సిద్ధం చేసేలా చర్యలు ప్రారంభించామని వివరించారు. ప్రతి జిల్లా ఆస్పత్రుల్లో 100 – 200 పడకలు సిద్ధంగా ఉంచాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
ఉత్తర్వులు పాటించడం లేదు
కరోనా సోకిన వృద్ధుల ఆరోగ్య పరిస్థితి సంక్షిష్టంగా మారుతున్నందున... వారికి మంచి వైద్యం అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. లాక్‌డౌన్ ఉత్తర్వులిచ్చినా కొంతమంది దీన్ని పాటించడం లేదన్న సీఎం... అక్కడక్కడా వెలుగుచూసిన ఘటనల దృష్ట్యా సరైన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప ఎవ్వరూ ఇళ్లు విడిచి బయటకు రాకుండా చూడాలని నిర్దేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏ వాహనాలూ రాకుండా అడ్డుకోవాలని స్పష్టం చేశారు. గూడ్సు, నిత్యావసర సరుకులతో కూడిన వాహనాలు తప్ప ఏవీకూడా తిరగరాదని సీఎం సూచించారు.
కుటుంబం నుంచి ఒక్కరికే అనుమతి
నిత్యావసర దుకాణాలు తప్ప.. మిగతావి మూసేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కనీస అవసరాలు కొనుగోలు చేసేందుకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరిని మాత్రమే అనుమతించాలని.... వారిని కూడా 3 కిలోమీటర్ల పరిధికే పరిమితం చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలు కూడా బాధ్యతగా వైద్య ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలని జగన్ సూచించారు.
ఇదీ చూడండి: